ఎండిపోయిన రిజర్వాయర్లు
హైదరాబాద్ : జలాశయాల్లో తగిన నీటి మట్టం లేదు. సాగునీటి కాలువలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఖరీఫ్ ప్రారంభమైనా సాగునీరు ఎప్పుడు విడుదలవుతుందో తెలియడంలేదు. దీంతో ఆయకట్టు రైతాంగం ప్రధానంగా కర్నూలుకడప(కెసి) కాలువ, తుంగభద్ర దిగువ (ఎల్ఎల్ సి) కాలువ సాగునీటిపై ఆధారపడింది. ఈ రెండు సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు సాగు కర్నాటక రాష్ట్రంలోని తుంగభద్రా డ్యాం, శ్రీశైలం జలాశయంలో నీటిమట్టంపైనే ఆధారపడింది. అయితే జలాశయాల్లో తగిన నీటిమట్టం లేకపోవడంతో రైతాంగం అయోమయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 800 అడుగులు మాత్రమే ఉంది. అలాగే తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ఎగువ ప్రాంతం నుండి వరద నీటి ప్రవాహం లేనందున ప్రస్తుతం 1582.38 అడుగులు మాత్రమే ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం చేరుకున్న తర్వాతే దిగువనున్న కాలువలకు సాగునీటి విడుదల అవుతుంది. అయితే ఈ జలాశయాలు ఎప్పుడు పూర్తి స్థాయికి చేరుకుంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
సాధారణంగా ప్రతి ఏటా జూలై 15లోగా ఎల్ఎల్ సి, కెసికి సాగునీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇంత వరకు సాగునీటిని ఎప్పటి నుండి విడుదల చేస్తారనే విషయం అధికారులు స్పష్టం చేయడం లేదు. తుంగభద్ర దిగువ కాలువ కింద ఖరీఫ్ లో 43,514 ఎకరాలు రబీలో 1,07.615 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేయాల్సి ఉండగా, ప్రస్తుతం ఖరీఫ్ లో 26వేల ఎకరాలు, రబీలో 44,500 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. అందులో కూడా వేలాది ఎకరాలకు సాగునీరు అందక రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. తుంగభద్ర డ్యాం నుండి అంతంత మాత్రంగా విడుదలయ్యే నీటిలో అధికంగా కర్నాటకలో రాష్ట్ర రైతాంగం నీటి చౌర్యానికి పాల్పడుతుండడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు గతంలో ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేమీ ఫలించడం లేదు. అక్రమ నీటి చౌర్యాన్ని అరికట్టాలని కోరుతూ జిల్లా ఏటా నీటిసలహా మండలి తీర్మానాలు చేసి పంపింన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు.
Pages: 1 -2- News Posted: 9 June, 2009
|