సంఘ్ విమర్శలపై కుతకుత
న్యూఢిల్లీ : సంఘ్ పరివార్ అనుసరించవలసిన పంథాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పరిశీలిస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో ఎల్.కె. అద్వానీతో సహా ప్రముఖ నాయకుల సన్నిహిత సహచరులు సంఘ్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికలలో బిజెపి పరాజయం దరిమిలా పార్టీలో సాగుతున్న నిందారోపణల తంతులో ఇది భాగంగా మారిపోయింది.
జూన్ మూడవ వారంలో జరగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావే్శంలో పార్టీ ఫలితాలను సమీక్షించినప్పుడు చోటు చేసుకునే పరిణామాలకు ఈ విమర్శలు, ప్రతివిమర్శలు ఒక సూచిక అని పార్టీ నాయకులు ఒకరు పేర్కొన్నారు. ఆతరువాత మేధో మథన శిబిరంలో ఎన్నికల ఫలితాలపై సమగ్ర విశ్లేషణ జరుగుతుందని లోక్ సభలో ఉప ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ తెలియజేశారు. ఆర్ఎస్ఎస్ పత్రిక 'ఆర్గనైజర్' కొంత కాలంగా అద్వానీ, అరుణ్ జైట్లీ, ప్రభృతి నాయకులు పలువురిపై విరుచుకుపడుతున్నది. ఇప్పుడు అద్వానీ సన్నిహిత సహచరులు సంఘ్ పై ఎదురుదాడి చేస్తున్నారు.
నాయకుల పరోక్ష అనుమతి లేకుండా ఈ దాడులు జరిగే అవకాశం లేదని మాట వినిపిస్తుండగా ఇందులో అధికారికంగా చెప్పేందుకు ఏమీ లేదని బిజెపి స్పష్టం చేస్తున్నది. ఎన్నికలలో పరాజయానికి ఆర్ఎస్ఎస్ ను, పార్టీ నాయకత్వాన్ని తప్పు పట్టుతూ అద్వానీ వ్యూహకర్త సుధీంద్ర కులకర్ణి వ్యాసం రాసిన ఒక రోజు తరువాత బిజెపి కులకర్ణిని 'స్వతంత్ర పాత్రికేయుని'గా అభివర్ణించింది. ఆయన అభిప్రాయాలతో తమకేమీ సంబంధం లేదని పార్టీ స్పష్టం చేసింది. 'నేను అద్వానీజీతో మాట్లాడాను. ఆయన (కులకర్ణి) అభిప్రాయాలతో తనకు సంబంధం లేదని అద్వానీజీ చెప్పారు' అని సుష్మా స్వరాజ్ తెలిపారు.
Pages: 1 -2- News Posted: 10 June, 2009
|