సంఘ్ విమర్శలపై కుతకుత
కులకర్ణి 'తెహల్కా'లో వ్యాసం రాస్తూ, ముస్లింలు, హిందుత్వం, పేదలు, ఆర్ఎస్ఎస్ పట్ల, తన పట్ల బిజెపి పునరాలోచన చేసుకోవలసిన అవసరం ఉందన సూచించారు. హిందువులలో ఒక వర్గం వారికే తాను ఎందుకు ఆమోదయోగ్యం అవుతున్నానో ఆర్ఎస్ఎస్ కూడా తనను తాను ప్రశ్నించుకోవలసిన అవసరం ఉందని ఆయన సూచించారు. మార్పు ఆవశ్యకత గురించి ప్రజలకు నచ్చజెప్పడంలో బిజెపి వైఫల్యానికి వ్యవస్థాగతమైన, రాజకీయపరమైన, సైద్ధాంతిక, సంస్థాగతమైన, ప్రచార సంబంధిత కారణాలు ఉన్నాయని కులకర్ణి పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారం సమయంలో పార్టీ నాయకత్వం 'సందిగ్ధత' చోటు చేసుకోవడం, అస్తవ్యస్తంగా ఉండడం గురించి కులకర్ణి ప్రస్తావించారు. వరుణ్ గాంధి ద్వేషపూరిత ప్రసంగం దుష్ప్రభావం, అద్వానీ వంటి దృఢమైన నాయకుడిని పార్టీ, సంఘ్ పరివార్ బలహీనుడుగా, నిస్సహాయునిగా, పూర్తిగా ఆధిపత్యం లేనివాడుగా కనిపించేట్లు చేయడం గురించి కూడా కులకర్ణి తన వ్యాసంలో ప్రస్తావించారు. 'జన సంఘ్ లేదా బిజెపి చరిత్రలో ఎన్నడూ అగ్ర స్థాయిలో ఇంత అస్తవ్యస్తంగా పార్టీ కనిపించలేదు. కేంద్రంలోను, రాజస్థాన్, యుపి, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాలలో వ్యవస్థాగత లోపం కింది స్థాయిలో పార్టీ కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బ తీసిందని, ఇదే ఘోరమైన ఫలితాలకు దారి తీసిందని కులకర్ణి వివరించారు.
ఎన్నికల ప్రచారం మధ్య లో ఎల్.కె. అద్వానీకి భావి వారసుడుగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని ప్రచారం చేయడం కూడా పార్టీ అవకాశాలను దెబ్బ తీసిందని ఆయన పేర్కొన్నారు. 2004 ఎన్నికల్లో ఓటమి అనంతరం మిత్ర పక్షాలు బిజెపికి దూరం కావడానికి గుజరాత్ అల్లర్లు కారణమని, 2002లో గుజరాత్ లో సంభవించిన మత కల్లోలాలు ఆ ఎన్నికలలో పార్టీ ఓటమికి ముఖ్య కారణంగా ఆ పార్టీలు భావించాయని, అందువల్ల బిజెపితో పొత్తు కొనసాగిస్తే తమకు ముస్లిం వోట్లు రావని అవి భయపడ్డాయని కులకర్ణి తెలియజేశారు.
ఆర్ఎస్ఎస్ 'సమకాలీన వాస్తవాలను గుర్తించడానికి విముఖంగా ఉన్న కారణంగా తన నైతిక ఆధిపత్యాన్ని, సామాజిక పలుకుబడిని కోల్పోయింది' అని బిజెపికి సన్నిహితుడైన మరొక జర్నలిస్ట్ స్వపన్ దాస్ గుప్తా వ్యాఖ్యానించారు. 'మే 16న పరాజయం అనంతరం మొత్తం చర్చకు స్వస్తి చెప్పేట్లుగా ఆర్ఎస్ఎస్ ఒత్తిడి తీసుకువచ్చి, మరింత అజమాయిషీ కోసం ప్రయత్నించే అవకాశం ఎక్కువగా ఉంది. అదే కనుక జరిగితే బిజెపికి భవిష్యత్తు శూన్యం కావచ్చు' అని స్వపన్ దాస్ గుప్తా అభిప్రాయం వెలిబుచ్చారు.
Pages: -1- 2 News Posted: 10 June, 2009
|