విద్యకు భారీగా నిధులు
న్యూఢిల్లీ : 390 విద్యా సంస్థలకు ఆర్థికపరమైన అనుమతి పొందడానికి కేంద్రం ప్రయత్నించనున్నది. ఉన్నత విద్యా రంగంలో శీఘ్రంగా ఫలితాలు సాధించానని చెప్పుకోవడానికై ఒక్క రోజులోనే వీటికి అనుమతిని సంపాదించేందుకు ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. ఇన్ని ప్రధాన ప్రాజెక్టులకు ఒకేసారి ఆర్థికపరమైన ఆమోదముద్ర పొందిన సందర్భం ఇటీవలి కాలంలో ఏదీ లేదని అధికారులు చెబుతున్నారు. కొత్త ఐఐఎంలతో పాటు పది కొత్త నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి)లు, 374 మోడల్ కాలేజీలకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం చేపట్టగలదని భావిస్తున్నారు.
ప్రభుత్వ ఖర్చుల ఆర్థిక కమిటీ (ఇఎఫ్ సి) ఈ ప్రాజెక్టులన్నిటి ఆర్థికావసరాలను మదింపు వేయనున్నదని, వీలైతే వాటికి ఆమోదముద్ర వేస్తుందని 'ది టెలిగ్రాఫ్' వార్తాపత్రికకు అందిన సమాచారం ద్వారా తెలుస్తున్నది. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ఉన్నత విద్య విస్తరణ పథకానికి వీటిని కీలకమైనవిగా భావిస్తున్నారు. కమిటీ గ్రీన్ సిగ్నల్ లభించినట్లయితే, ఈ ప్రాజెక్టులను ఆమోదం కోసం మంత్రివర్గం పరిశీలించవచ్చు. ఆతరువాత ఈ విద్యా సంస్థల ఆవిర్భావం జరుగుతుంది.
ఉన్నత విద్య రంగానికి సంబంధించి యుపిఎ ఇచ్చిన హామీలలో భాగమే కొత్త ఐఐఎంలు, ఎన్ఐటిలు, మోడల్ కాలేజీలు. వీటి ఏర్పాటుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. మంత్రివర్గం ఆమోదముద్ర కోసం ఆర్థికపరమైన అనుమతి పొందవలసి ఉంటుంది.
ఉన్నత విద్యా రంగం విస్తరణ బ్లూప్రింట్ లో భాగమైన 14 కొత్త 'ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయాలు', 20 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటి)లకు సంబంధించిన ప్రతిపాదనను ఇంకా ఖరారు చేయలేదు.
Pages: 1 -2- News Posted: 10 June, 2009
|