అభిమానులకు ధోని క్షమాపణ
'రన్ రేట్ పెరిగిపోయింది. కీలక సమయాల్లో వికెట్లు పతనమయ్యాయి. మేము బ్యాట్ తో విఫలురమయ్యాం. ఇందుకు కారణమేదీ చెప్పలేం' అని ధోని పేర్కొన్నాడు. భారత ఇన్నింగ్స్ స్థిరీకరణకు ఉపయోగిస్తుందనే రవీంద్ర జడేజాను బ్యాటింగ్ క్రమంలో ముందు పంపాలనే నిర్ణయం తీసుకున్నట్లు అతను చెప్పాడు. 'యువరాజ్ ఇంకా ముందే బ్యాట్ చేసి ఉండవచ్చు. కాని జడేజా కొన్ని ఓవర్లు ఆడి మాకు ఇన్నింగ్స్ కు స్థిరత్వం తీసుకురాగలడని ఆశించాం. యువరాజ్ ఆవిధంగా (స్టంపింగ్ ద్వారా) అవుట్ కావడం దురదృష్టకరం. ఒక్కొక్కసారి అలా జరుగుతుంటుంది' అని ధోని పేర్కొన్నాడు.
'దురదృష్టకర పరిస్థితులలో మేము వికెట్లు కోల్పోయాం. ప్రత్యర్థి జట్టు 153 పరుగులు స్కోరు చేసి, మీరు ఆ స్కోరు చేయలేకపోతే అది క్షమార్హమే కాదు' అని అతను అన్నాడు. 'రన్ రేట్ ఓవర్ కు 9, 10కు దగ్గరగా ఉంటే మేము సాధించగలమని నేను భావించాను. కాని వికెట్లు కీలక సమయంలో పతనమయ్యాయి. రన్ రేట్ బాగా పెరిగిపోయింది' అని ధోని చెప్పాడు. అయితే, కారిబియన్ దీవులలో ఈ సారి జరిగే ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఇండియా తిరిగి విజృంభించగలదని ధోని వాగ్దానం చేశాడు.
'మేము 2007 ప్రపంచ కప్ లో ఓడిపోయాం. 50 ఓవర్ల టోర్నీలో ఓడిపోయా. అది నా కెరీర్ లో అత్యంత దారుణమైన పరిణామం. ఈ ఓటమి నిరాశాజనకమైనదే. కాని 50 ఓవర్ల ప్రపంచ కప్ టోర్నీలో మా పరాజయంతో దీనిని పోల్చలేమని నా భావన' అని అతను పేర్కొన్నాడు. 'మేము ఆశించిన మేర రాణించలేకపోయాం. కాని మరి తొమ్మిది నెలల్లో మరొక ప్రపంచ కప్ ఉన్నది. అందులో రాణించేందుకు మేము ప్రయత్నిస్తాం' అని ధోని చెప్పాడు.
'మీరు బాగా రాణిస్తున్నప్పుడు క్రికెట్ మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ పరీక్షించదు. కాని మీరు రాణించనప్పుడే అది పరీక్షిస్తుంది. ఇది మాకు పరీక్షా సమయమని నా భావన. అయితే, ఇప్పుడు ముంచుకుపోయిందేమీ లేదని అనుకుంటున్నాను' అని అతను చెప్పాడు.
గాయపడిన ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లేకపోవడం భారత జట్టు ఆట తీరును ప్రభావితం చేసిందా అనే ప్రశ్నకు ధోని సమాధానం ఇస్తూ, 'అతను సాటిలేని క్రీడాకారుడే. అతను లేని లోటు కనిపించింది. అతను బ్యాట్ చేస్తున్నప్పుడు బౌలర్ ఒత్తిడి ఎదుర్కొంటుంటాడు. అతను ఏ జట్టులోనైనా ఉండదగినంత గొప్ప క్రీడాకారుడు' అని ధోని పేర్కొన్నాడు. ఇక సెహ్వాగ్ బదులు ఓపెనర్ గా ఆడిన రోహిత్ శర్మ తన వంతు బాధ్యత నిర్వర్తించాడని ధోని చెప్పాడు.
Pages: -1- 2 News Posted: 15 June, 2009
|