`స్థానిక' కుస్తీకి సమాయత్తం
శాసనసభ ఎన్నికల్లో ఆశించినన్ని ఎమ్మెల్యే సీట్లు సాధించలేక పోయిన వైఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించి తన సత్తా చాటేందుకు సిద్ధపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలు, ఎమ్ పిలు, పార్టీ శ్రేణులకు వైఎస్ ఇప్పటికే స్పష్టమైన సూచనలిచ్చారు. గతంలో రెండు పార్టీలే ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సునాయాసంగా గెలిచేది. ప్రస్తుతం త్రిముఖ, చతుర్ముఖ, కొన్ని చోట్ల ఐదు ప్రధాన పార్టీల మధ్య కూడా పోటీ ఏర్పడనుంది. పార్టీలకంటే అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ఠే ఫలితాలపై ఎక్కువ ప్రభావం చూపనుంది. సామాజిక న్యాయం, సైద్ధాంతిక సారూప్యతల కంటే ఆమోదయోగ్యమైన వ్యక్తులే ఈ ఎన్నికల్లో గెలుపు సాధిస్తారు.
క్షేత్రస్థాయి నుంచి అభిమానుల బలమున్న చిరంజీవి ఈ అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకుంటారోనని విశ్లేషకులు ఎదురు చూస్తున్నారు. ఉత్సాహమైన యువతను ఎన్నికల్లో ప్రోత్సహించడం అన్నిపార్టీలకు కలిసొస్తుంది. అసెంబ్లీలో బలం లేని పిఆర్పీ స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తే అధికారపార్టీని సమర్ధవంతంగా కట్టడి చేయగలుగుతుంది. జడ్ పి చైర్మన్లు కేబినెట్ హోదా కలిగి ఉన్నారు. మున్సిపల్ చైర్మన్లు ఎమ్మెల్యేల స్థాయిలో వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు సర్పంచ్ లు, ఎమ్ పిటిసిలు, జడ్ పిటిసిలు, ఎమ్ పిపిలు తమతమ పరిధిలో ప్రజలపై, పాలనపై కూడా తమ ప్రభావం చూపగలుగుతున్నారు.
స్థానిక సంస్థలపై పట్టు సాధిస్తే రాష్ట్ర స్థాయిలో అధికార పార్టీ చేసే అవకతవకలను ఎదుర్కొనే అవకాశం పిఆర్పీకి ఉంటుంది. ఈ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుంటే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పిఆర్పీ ఓ బలమైన శక్తిగా మారుతుంది. ఇప్పటికీ చిరంజీవి గత ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూ కొన్ని పార్టీలతో జతకట్టే ప్రయత్నాలకే పరిమితమయ్యారు. అటు వైపు నుంచి స్పందన కొరవడ్డా చిరంజీవి మాత్రం ఈ ప్రయత్నాన్ని విడవకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా పిఆర్పీ ఏదో పార్టీకి తోకగానే మిగులుతుందని హెచ్చరిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 16 June, 2009
|