తెలుగుదేశం పిలుస్తోంది!
హైదరాబాద్ : తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా! ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేసినప్పుడు బహుళ జనాదరణ పొందిన నినాదమిది. ఆ స్థాయిలో పార్టీ తిరిగి ప్రజలను ఆకట్టుకునే అవకాశం లేకపోయినప్పటికీ పార్టీని వీడి వెళ్ళిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి టిడిపి మరోసారి ఇలాంటి పిలుపును ఇవ్వనుంది. ఈసారి ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాకపోవడానికి ప్రజారాజ్యం చీల్చిన ఓట్లే ప్రధాన కారణంగా టిడిపి భావిస్తోంది. పిఆర్పీలో చేరిన వారిలో పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులే ఎక్కువగా ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు టిడిపి నాయకులు పార్టీని వీడి ప్రజారాజ్యంలో చేరారు. వీరి వల్ల పార్టీ ఓట్లు గణనీయంగా చీలి ఎన్నికల్లో ఓడిపోయామని టిడిపి భావిస్తోంది.
ఉత్తరాంధ్ర మొదటి నుంచి టిడిపికి కంచుకోటలా ఉంటూ వస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో టిడిపికి ఈ స్థాయిలో పరాజయం ఎప్పుడూ కలగలేదు. ఉత్తరాంధ్రలో ప్రజారాజ్యం పార్టీ 22 శాతం ఓట్లను చీల్చుకోవడం వల్లనే పార్టీ ప్రధానంగా దెబ్బతిన్నదని టిడిపి భావిస్తోంది. ఇక తెలంగాణలో సైతం పిఆర్పీ చీల్చిన ఓట్ల వల్ల కాంగ్రెస్ ప్రయోజనం పొందిందని టిడిపి నాయకత్వం భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సైతం ఇదే విధంగా ప్రజారాజ్యం గణనీయంగా ఓట్లు చీలిస్తే ప్రమాదమని, దానిని దృష్టిలో పెట్టుకుని టిడిపి నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలనే ఆలోచన టిడిపిలో బలంగా సాగుతోంది. అదే సమయంలో ఆయా జిల్లాల్లో ప్రస్తుత టిడిపి నాయకత్వం తిరిగి వారిని చేర్పించుకునే విషయంలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుందో అనే సందేహం కూడా పార్టీ నాయకత్వానికి ఉంది.
Pages: 1 -2- News Posted: 17 June, 2009
|