అన్ని పార్టీలదీ అదే తీరు
ప్రజారాజ్యంలో అయోమయం, గందరగోళం రాజ్యమేలుతోంది. ప్రజారాజ్యం ఏర్పడి పది నెలలు కావస్తున్నా, ఇంతవరకు ఆ పార్టీకి దశదిశ లేకుండా పోయింది. పార్టీ అధికార ప్రతినిధి మిత్రా ఎట్టకేలకు ప్రజారాజ్యం నుంచి నిష్క్రమించారు. ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమనీ, చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారన్న కలలు ఇవిఎం బాక్స్ ల వద్ద తుస్సుమన్నాయి. 18 మంది ఎమ్మెల్యేలతో సంతృప్తిపడాల్సిన పరిస్థితుల్లో చిరంజీవి రాజకీయ వ్యూహంతో ఈపార్టీని వచ్చే ఐదేళ్ళ వరకూ ఎలా నడుపుతారన్నది అనుమానమేనని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీలో చేసిన కాంగ్రెస్, టిడిపి వలస నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటూ ఆ పార్టీ నేత దేవేందర్ గౌడ్ చేసిన ప్రకటన ప్రజారాజ్యంపార్టీలో ప్రకంపనలు సృష్టించింది. తాను అలా చెప్పలేదని, పత్రికల వారు తప్పుగా అర్ధం చేసుకున్నారని దేవేందర్ గౌడ్ వివరణ ఇవ్వగా, స్వయంగా పార్టీ అధినేత చిరంజీవి కూడా దీన్ని ఖండించారు. అయినప్పటికీ కొందరు నాయకులు మాత్రం టిడిపితో పొత్తును తోసిపుచ్చకపోవడం గమనార్హం. ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు ్రవింద్ పార్టీ కార్యాలయానికి రావడం లేదు. యువరాజ్యం అధినేత పవన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాగబాబు చిరునామా తెలియదు. రాజకీయ అనుభవం లేక ఎత్తుకు పైఎత్తు వేసే వ్యూహం ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి తెలయికపోవడంతో పార్టీలోని కాంగ్రెస్, టిడిపి నుండి వలస వచ్చిన నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. కాంగ్రెస్, టిడిపిల్లో ఎవరు ప్రధాన శత్రువులు అన్నది తేల్చుకోలేక పిఆర్పీ సతమతమవుతోంది.
క్రమశిక్షణకు మారు పేరని ప్రకటించుకునే తెలుగుదేశం పార్టీలోకూడా అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగిన నెల రోజుల్లోనే ఒక ఎమ్మెల్యేను పార్టీ నుంచి టిడిపి నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీలో సీనియర్లకు, జూనియర్లకు మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే టిడిఎల్ పి కార్యవర్గం నియామకంలో జాప్యం జరిగింది. కాగా, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి పార్టీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసన తెలుపుతూ రాసిన బహిరంగ లేఖ సంచలనం సృష్టించింది. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నిక సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు, ఉపనేత అశోక్ గజపతి రాజు వ్యవహరించిన తీరుపై ప్రసన్నకుమార్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి తన ధోరణిని మార్చుకోకపోవడంతో చివరకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
Pages: -1- 2 -3- News Posted: 22 June, 2009
|