వికటిస్తున్న వైఎస్ ఫార్ములా
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీపై పూర్తి స్థాయి దృష్టి సారించారు. రానున్న ఐదేళ్ళలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలంటే ఇప్పటినుంచే దానిపై దృష్టి సారించక తప్పదని గ్రహించిన ఆయన, టిడిపి-టిఆర్ఎస్-పిఆర్పి నేతలను పార్టీ ఫిరాయింపు వైపుమళ్ళించేందుకు వ్యూహ రచన మొదలుపెట్టారు. ప్రతి సమావేశంలో ఇతర పార్టీల వారిని చేర్చుకోమని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమో, ఇతర పార్టీల వారు చేరుతుంటే అడ్డుకోవద్దని సూచించడమో చేస్తున్నారు. ఇలా ఇతర పార్టీల వారిని తీసుకువచ్చి అందలమెక్కించడం కాంగ్రెస్ నాయకులకు రుచించడం లేదు. పార్టీ అధికారంలోనే ఉన్నందున తమను ప్రోత్సహిస్తే స్థానికంగా పార్టీని మరింత బలోపేతం చేస్తామంటున్నారు.
ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి తమ పార్టీపై ఎందుకు అభిమానం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. `మాలాంటి వారిని ప్రోత్సహిస్తే ఇతర పార్టీల వారిని చేర్చుకునే అవసరం లేకుండా మేమే స్థానికంగా పార్టీని గట్టిపరుస్తాం. కరుణాకర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మల్లాది విష్ణు వంటి నేతలను ప్రోత్సహించబట్టే కదా వారు ఈ స్థాయికొచ్చింది. అదే విధంగా మమ్మల్నీ ప్రోత్సహిస్తే మేమూ బలోపేతం అయి పార్టీకి ఉపయోగపడతాం. సంపాదన కోసమో, పైరవీల కోసమో, ఆస్తులు పోతాయన్న భయానికో మిగిలిన పార్టీల నుంచి మా పార్టీలోకి వస్తున్న నాయకులు మళ్ళీ వారి పార్టీలు అధికారంలోకొచ్చే వాతావరణం ఉంటే మళ్ళీ అటు వెళ్ళిపోతారు. అప్పుడు పార్టీకే నష్టమ'ని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 -3- News Posted: 1 July, 2009
|