వికటిస్తున్న వైఎస్ ఫార్ములా
ఇతర పార్టీల నుంచి వచ్చేవారు కాంగ్రెస్ లో ఎక్కువ కాలం ఇమడలేరని, వారి పార్టీల్లో ఉన్నంత ఆదరణ, గౌరవం ఇక్కడ లభించదని చెబుతున్నారు. మహా సముద్రం లాంటి కాంగ్రెస్ లో మహామహులకే ఎలాంటి గ్యారంటీ ఉండదని, వైఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉండే కెవిపి రామచంద్రరావు వంటి వారికే ఎన్నోసార్లు ప్రయత్నించిన తర్వాత గానీ రాజ్యసభ టికెట్ రాలేదని ఉదహరిస్తున్నారు. అయితే, అంత ఓపిక ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులలో ఉండదంటున్నారు. `సహజంగా మా వాళ్ళు ఏదో ఒక పదవి ఇస్తామన్న హామీతో పార్టీలో చేర్చుకుంటారు. కానీ, ఆ తర్వాత అది సాధ్యం కాదు. అప్పుడు విసిగిపోయిన వాళ్ళు తిరిగి పాత గూటికి వెళ్ళిపోతారు. ఇలాంటి మేం ఎన్ని చూడలేద'ని మరో ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ఇలాంటి నేతలు ఒకవేళ కాంగ్రెస్ ను విడిచి వెళితే, పార్టీకి ఇప్పటికంటే అప్పుడే ఎక్కువ నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వారు పార్టీలో చేరినప్పుడు సహజంగా కొంత క్యాడర్ ను ఆకర్షిస్తారని, పదవులు రానందుకు అలిగి తిరిగి పాత పార్టీలోకి వెళ్ళిన సందర్భాల్లో వారి వెంట ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ క్యాడర్ ను కూడా తీసుకుని వెళతారని వివరిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చేర్చుకునే సమయంలో కనీసం పట్టణ, మండల అధ్యక్షులు, చివరకు ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా చేరికలను ప్రోత్సహించడం వల్ల స్థానికంగా కొత్త వర్గం తయారవడంతో పాటు... స్థానిక నాయకులకు గుర్తింపు తగ్గుతుందని జిల్లా నేతలు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ చేరికల వ్యవహారంపై ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షుల్లో కూడా అసంతృప్తి భగ్గుమంటోంది. కాని పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోవడంతో వారంతా విధిలేక మౌనంగా ఉంటున్నారు. తమతో మాటమాత్రమయినా చెప్పకుండానే నిర్ణయాలు తీసుకోవడం వారికి రుచించడం లేదు. చాలామంది ఎమ్మెల్యేలను బలవంతంగా ఒప్పించి ఇతర పార్టీల వారిని చేర్చుకుంటున్నారన్న విమర్శలూ లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితి అంతా అనుకూలంగా ఉన్నందున `అంతా బాగుంద'నే భావన కలగడం సహజమని, కానీ పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉండవన్న వాస్తవాన్ని గ్రహించాలంటున్నారు.
Pages: -1- -2- 3 News Posted: 1 July, 2009
|