బిసిసిఐ పీఠంపై దాదా కళ్ళు
బిసిసిఐ అధ్యక్ష పదవిపై దృష్టిని సారించిన విషయం గంగూలీ పరోక్షంగా వెల్లడించాడు. జన్మదినం సందర్భంగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, అనేక సంవత్సరాలపాటు భారత క్రికెట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరంగా కాపాడుకోవడంతోపాటు భారత జట్టు కెప్టెన్ గా కూడా విజయవంతమైన తనకు బోర్డు వ్యవహారాలు కొత్తేమీ కాదని గంగూలీ స్వయంగా చెప్పాడు. ఏం చేస్తే అది కొత్తదనం అవుతుందో తనకు బాగా తెలుసు అన్నారాయన. ఇక గంగూలీ బిసిసిఐ అధ్యక్ష పదవికి పోటీకి దిగడానికి అనువుగా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఎన్నికల బరిలోకి గంగూలీని దింపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఈనెలాఖరున జరగబోతున్నాయి. అయితే ఎన్నికలలో దూకడానికి గంగూలీ సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదు.
క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ నా మాతృ సంస్థ. పిల్లవాడిగా క్రికెట్ ఆడుతున్న రోజుల నుంచి నా గురించి తెలిసిన ఎందరో అందులో ఉన్నారు. వారిపట్ల నాకు ఎనలేని గౌవం ఉంది. బెంగాల్ క్రికెట్ పట్ల నాకున్న శ్రద్ధ, భక్తి ఎలాంటిదో వారికి తెలుసు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ లో నేను అడుగుపెడితే ఎలాంటి మార్పులు తీసుకురాగలనో కూడా వారికి తెలుసు అని గంగూలీ చెప్పారు. 121 మంది సభ్యులు (ఓట్లు) ఉన్న బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లో అంకెలు తనకు అనుకూలంగా ఉన్నాయని ధృఢంగా నమ్మితే తప్ప ఎన్నికల గోదాలోకి దూకడానికి గంగూలీ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఒకవేళ పరిస్థితులు గంగూలీకి అనుకూలంగా లేకపోయినా ఇప్పట్లో అతనికి జరిగే నష్టం కూడా లేదు. బిసిసిఐ అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడటానికి గంగూలీకి ఇంకా అయిదేళ్ళ వ్యవధి ఉంది.
Pages: -1- 2 News Posted: 8 July, 2009
|