వలస పక్షులు ఇంటిముఖం
మరో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు పిఆర్పీని వీడనున్నారని అయితే తనకు రాజకీయ గురువైన కిమిడి కళావెంకట్రావు సూచన మేరకే ఆయన ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయించుకుంటారని తెలిసింది. కళావెంకట్రావు పిఆర్పీని వీడాలని భావిస్తున్నప్పటికీ జిల్లాలో ఎర్రన్నాయుడు వ్యవహారశైలి పట్ల ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అందువల్ల కొంతకాలం పాటు పిఆర్పీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. కంబాల జోగయ్య విషయంలో తుదినిర్ణయం జరగవలసి ఉంది. విశాఖ జిల్లాకు చెందిన తెదేపా సీనియర్ నేతలు రెహ్మాన్, జహీరుద్దీన్, గణబాబులు ప్రస్తుతం పిఆర్పీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇదే జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు వీరిని పిఆర్పీలోనే కొనసాగాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
కాగా ఇతర పార్టీలలో చేరి పశ్చాతాపంతో తెదేపాలోకి రావాలనుకుంటున్న సీనియర్ నేతలును స్థానిక ఎన్నికలకు ముందు పార్టీలోకి తీసుకుందామని చంద్రబాబు జిల్లా ముఖ్యనేతలతో చెప్పినట్లు సమాచారం. ఎన్నికలై రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే ఇతర పార్టీలలోకి వెళ్లిన వారిని తిరిగి తీసుకుంటే పార్టీలోనూ, బయట అసత్య ప్రచారం జరగడంతో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నట్టు తెలిసింది. జిల్లాలో పార్టీని మరింత పటిష్టపరిచి స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన కిందిస్థాయి నాయకులను కోరుతున్నారు.
ఎన్నికల్లో తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి పార్టీ అభ్యర్థుల పరాజయానికి కారకులైన ఇతర పార్టీల నేతలను ఇంత త్వరగా పార్టీలోకి ఆహ్వానిస్తే నాయకులు, పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురువుతారని, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుని ఇబ్బందులు కూడా పడే అవకాశముందని ఆయన చెప్పినట్టు సమాచారం. స్థానిక ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని, ఇందులో భాగంగా పీఆర్పీ, కాంగ్రెస్, లోక్ సత్తాలలో ఉన్న ద్వితీయశ్రేణి నాయకగణాన్ని తెదేపాలోకి చేరేవిధంగా వారిని ఒప్పించి రప్పించాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం.
Pages: -1- -2- 3 News Posted: 13 July, 2009
|