కొత్త పాలనకు కసరత్తు
హైదరాబాద్ : రాష్ట్రంలో పాలనా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొత్త పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు ఉన్న ఐఎఎస్, గ్రూప్ - 1 మాదిరిగానే మధ్యస్థంగా మరో వ్యవస్థను కూడా ఏర్పాటు చేసేందుకు అవసరమైన అంశాలను ప్రభుత్వం జోరుగా పరిశీలిస్తోంది. కర్నాటక, ఒరిస్సాలో ఉన్న రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు మాదిరి గానే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును ప్రారంభించేందుకు అనువైన అంశాలను పరిశీలిస్తోంది. గ్రూప్ - 1 ద్వారా నియమితులైన అధికారుల్లో బాగా పనిచేసే వారిని గుర్తించి వారిని రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లోకి తీసుకుంటారు. ఇటువంటి వారిని గుర్తించే బాధ్యతను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఒక కమిటీకి అప్పగిస్తే ఎలా ఉంటుందన్న విధానాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
గ్రూప్ - 1 ద్వారా ఎంపికై రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ, వాణిజ్య పన్నులు వంటి శాఖలకు కేటాయించబడిన అధికారుల పనితీరును గుర్తించి వారిని కొత్తగా ఏర్పాటుచేసే రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి తరలిస్తారు. అటువంటి వారికి ఐఎస్ అధికారుల అవసరానికన్నా తక్కువగా, ఆర్జీవోల కన్నా ఎక్కువగా ఉండే కొన్నిపోస్టులను గుర్తించి పోస్టింగ్ లు ఇస్తారు. రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ విభాగంలోకి ఇతర శాఖల నుండి అధికారులను తీసుకున్న తరువాత ఆయా శాఖల నుండి అధికారులను కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతులు లభించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు కూడా రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ విభాగంలోకి వచ్చిన తరువాత తొలగిపోతాయని భావిస్తున్నారు. ఈ కొత్త సర్వీసుల ఏర్పాటుపై త్వరలో ఆలోచన చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ విధానం అమలులో ఉన్న కర్నాటక నుండి సమాచారాన్ని తెప్పించుకోవడంతో పాటు, కొత్తగా అమలు చేసేందుకు నిర్ణయించిన ఒరిస్సా నుండి కూడా వివరాలు రప్పించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Pages: 1 -2- News Posted: 17 July, 2009
|