కృష్ణకు భారీగా వరద
కర్నూలు : రాష్ట్రంలో కురుకుస్తున్న భారీ వర్షాలతో కృష్ణ, తుంగభద్ర నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 50 వేల క్యూసెక్కుల నీరు జిల్లాలోని కోట్ల విజయభాస్కరరెడ్డి (సుంకేసుల) బ్యారేజీకి చేరిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేగాక ప్రాజెక్టు ద్వారా తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా అనంతపురం, దిగువ కాలువ ద్వారా కర్నూలు జిల్లా రైతాంగానికి సాగునీటిని విడుదల చేశారు. సుంకేసుల బ్యారేజీ నీటి సామర్థ్యం 1.20 టిఎంసీలు కాగా ప్రస్తుతం 0.30టిఎంసీల లోపే నీరుందని అధికారులు చెప్పారు.
తుంగభద్ర డ్యాం నుంచి పరవళ్ళు తొక్కుతూ వస్తున్న నీటితో బ్యారేజీ నిండుతుందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ఆ నీరు వచ్చి చేరితే దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. మరో వైపు సుంకేసుల ద్వారా కేసీ కాలువకు నీటిని విడుదల చేసే అంశం కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక కృష్ణా నదిపై నిర్మించిన ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపూర్ ప్రాజెక్టుకు నీరు విడుదల చేశారు. ఈ రెండు ప్రాజెక్టులు కర్నాటక రాష్ట్రంలో ఉన్నవే. ఈ రెండు జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం సుమారు 167 టిఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ఆల్మట్టిలో 30 టిఎంసీలు, నారాయణపూర్ లో 20 టిఎంసీల నీరు వచ్చి చేరితే దిగువన ఉన్న జూరాలకు నీటిని విడుదల చేయవచ్చని సాగునీటి శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఇన్ ఫ్లో అలాగే కొనసాగితే జూరాలకు త్వరితగతిన నీరు విడుదల చేసే అవకాశం ఉందని వారంటున్నారు.
Pages: 1 -2- News Posted: 22 July, 2009
|