అసెంబ్లీ అర్ధాంతర వాయిదా
హైదరాబాద్ : ఆర్ధిక మంత్రి రోశయ్య వ్యాఖ్యలు అసెంబ్లీలో సెగలను రగిలించాయి. బుధవారం నాటి శాసనసభ మూడో రోజు బడ్జెట్ సమావేశం అర్ధాంతరంగా వాయిదాపడింది. `నువ్వు పెద్ద మగాడివా. మాట్లాడటానికి సిగ్గూ శరం ఉండాలి' అంటూ తెలుగుదేశం నేత ముద్దుకృష్ణమనాయుడిపై చేసిన వ్యాఖ్యలకు రోశయ్య క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షం నేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. అత్యంత అభ్యంతరకరంగా, సభా మర్యాదకు విరుద్ధంగా ఉన్న ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయన పట్టుపట్టారు. సభలో రోశయ్య లేరని, తాను రికార్డులను పరిశీలించి తగిన చర్య తీసుకుంటానని స్పీకర్ చెప్పినా చంద్రబాబు ససేమిరా అన్నారు.
రోశయ్యను సభకు పిలిపించి క్షమాపణ చెప్పించవలసిందేనని, అంతవరకూ ఈ సభ నడవటానకి వీల్లేదని భీష్మించారు. ఈ దశలో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఈ పద్దతిలో సభాకార్యక్రమాలకు అడ్డు తగిలితే సహించేది లేదని, తానిచ్చిన రూలింగ్ ను ప్రశ్నించడం సమంజసం కాదని ఆగ్రహం వెలుబుచ్చారు. స్పీకర్ తమను కూర్చోమని పదేపదే చేతులు ఊపడాన్ని తప్పుపడుతు తెలుగుదేశం సభ్యులు పోడియం వద్దకు దూసుకువచ్చారు. నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కొనసాగించారు. దాంతో ఉదయం 11.49 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
బడ్జెట్ పై చర్చించడానికి మూడో రోజు సమావేశం ప్రారంభం నుంచి అసెంబ్లీలో అధికారపక్ష, ప్రతిపక్షసభ్యల నడుమ మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. టీ బ్రేక్ తరువాత సమావేశం తిరిగి మొదలు కాగానే తెలుగుదేశం నాయకుడు ముద్దుకృష్ణమనాయుడు నిన్నటి వివాదాన్ని ప్రస్తావించారు. రోశయ్య తనపై చేసిన వ్యాఖ్యాలను ఆయన స్పీకర్ దృష్టికి తెచ్చారు. దీనికి స్పందనగా తాను రికార్డులు పరిశీలించి వాటిని తొలగిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. సభలో మంత్రి రోశయ్య లేనందువలన ఆయన గురించి ప్రస్తావించడంలో అర్ధం లేదని స్పీకర్ పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 29 July, 2009
|