పూజారిని శిక్షించాల్సిందే. కానీ? అమ్మో! దేవునికే సొంతమైన కేజీన్నర నగలు దొంగతనంగా పట్టుకుపోయి, శేఠ్ కొట్లో తాకెట్టేట్టేసేడంటే... ఈడెవడో గుండెలు తీసిన బంటే అయిఉంటాడనీ, విలాసవంతమైన మూడంతస్తుల మేడలో కులాసాగా కులికేసేవాడనీ... కనీసం మారుతీ ఎసీ కారులో తిరిగేస్తూ ఉంటాడనీ, కేజీ కందిపప్పు వంద రూపాయలయిపోయిన ఈ రోజుల్లో కూడా ముప్పూటలా ముద్దపప్పన్నాన్ని నేతితో మెక్కేస్తూ ఉంటాడనీ ... పెళ్ళానికి పట్టుచీరలు కొనేసేవాడేనని, బంగారు నగలు వంటి నిండా దిగేసే ఉంటాడనీ... ఇలాంటి అర్చకుడిని కొరడాలతో కొట్టాలని, కొరత వేయాలని, ఉరి తీయాలనీ... ఇలాంటి అవేశమే అఖిలాంధ్ర భక్త కోటి హృదయాలలో పెల్లుబికింది. కానీ...
కానీ... తరతరాలుగా తిరుమలలోని శ్రీకోదండ రామస్వామి ఆలయంలో అర్చకత్వం చేస్తున్న రమణ దీక్షితులను టెలివిజన్లలో చూసినప్పుడు నిజంగానే ప్రతీ వారి హృదయాలు తరుక్కుపోయాయి. అయ్యో పాపం... అన్న జాలి మనస్సును కలిచివేసింది. దీక్షితులి పేదరికాన్ని తమకు తెలిసో తెలియకో టెలివిజన్ ఛానళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపించాయి. దేవుని పట్ల అపచారానికి ఒడిగట్టాడన్న ఆగ్రహం రగులుతున్నా ప్రధాన అర్చక బిరుదాంకితుడైన దీక్షితుల దయనీయ బతుకు స్థితి అర్ధమయ్యే సరికి గుండెల్లోపల్లో ఎక్కడో తడి తడిమింది.
వాస్తవ దృశ్యం మరో కోణాన్ని ఆవిష్కరించింది. పెచ్చులూడిపోయిన, రంగులు వెలసిపోయిన మురికి గోడల మధ్య, కుక్కి మంచంలో కూర్చున్న అర్చకుని అర్భక దేహం. పట్టుబడిపోయామన్న వేదనతో దిగాలు పడిపోయిన భార్యభర్తల రూపం... దొంగలన్న ముద్రను మోయాలన్న నిజం దహించివేస్తుంటే... నిస్సహాయంగా దిక్కులు చూస్తున్న దీనత్వం. తిరుమలేశుని సమక్షంలో శ్రీరాముని కొలుస్తున్న ప్రధాన అర్చకుడు కటిక పేదరికంలో దశాబ్దాలుగా మగ్గిపోతున్న వైనం విస్మయాన్నే కలిగించింది. ఆ ఇంట్లో, వాళ్ళ ఒంట్లో అణువణువునా దరిద్రం తాలూకు అనవాళ్ళే వేళ్ళూనుకుని కనిపించాయి.
Pages: -1- 2 -3- News Posted: 23 August, 2009
|