పూజారిని శిక్షించాల్సిందే. కానీ? ఆకలి మానాభిమానాలను నిర్దయగా చంపేస్తుంది. పేదరికం తెగింపు ఇస్తుంది. పరాయిసొత్తు మీద ఆశ దుర్మార్గాలను చేయిస్తుంది. రమణ దీక్షితుల దేవుని నగలు దొంగతనంగా తీసుకెళ్ళడం తెగింపునే సూచిస్తోంది. వాటిని అమ్మేసి దరిద్రాన్ని ఒక్కదెబ్బతో జయించే అవకాశం ఉన్నా, వాటి స్థానంలో నకిలీ నగలను పెట్టే వీలున్నా ఆ పని చేయలేకపోయాడు. మూడు వేల రూపాయల జీతంతో ఐదుగురి పొట్టలను నింపడం ఎలానే తెలియని ఈ అర్చకుడు ముగ్గురు కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేసాడు. తండ్రిగా ఈ సమాజంలో నెరవేర్చవలసిన బాధ్యతను సక్రమంగానే పూర్తి చేశాడనే చెప్పాలి. తనకున్న రోగాలతో పోరాడుతున్నాడు. ప్రధాన అర్చకునిగా సామాజిక హోదా బహుశా అడుక్కోడానికి అడ్డుపడి ఉంటుంది. పేదవాడికి అప్పులిచ్చి ఆదుకునే ఔదార్యం ఇంకా ఈ దేశంలో జన్మించలేదు. కాబట్టి తనకు అందుబాటులో ఉన్న దేవుని నగలను కుదువపెట్టే సాహసం చేశాడు. అక్కడ కూడా దేవుని పట్ల భక్తి, చేసిన పాపం పట్ల భయం ఉంది. మొత్తంగా దిగమింగేసే దొంగబుద్దీ ప్రదర్శించిన దాఖలాలు లేవు. కాబట్టే ఏడాది క్రితం జీతం పదివేలకు పెరిగినా దానిని వడ్డీలకు కడుతూ చేసిన పాపానికి పరిహారంగా అర్ధాకలితోనే బతికినట్లు కనిపిస్తోంది.
తనిఖీ జరిగే సమయానికి నగలను తీసుకువచ్చి ఆలయంలో ఉంచేవాడినని, పదేళ్ళుగా ఇదే పని చేస్తున్నానని రమణ దీక్షితులు అంగీకరిస్తున్నాడు. తాకట్టు పెట్టిన నగను మర్వాడీ వర్తకుడి నుంచి తీసుకురావడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిత్యం దేవుని స్పృశించి పూజించే ఆ చేతులతో శేఠ కాళ్లు పట్టుకోవాలి. వంశపారంపర్యంగా నేర్చుకున్న ఆగమశాస్త్రాన్ని, వేద మంత్రాలను జపించే నోటితో శేఠ్ ను హీనంగా వేడుకుని ఉండాలి. సరే ఏం పాట్లు పడ్డాడో చేసిన తప్పు బయటపడకుండా కప్పిపుచ్చడానికి. ఇక్కడ శ్రీవారి డాలర్లు మాయమైపోయినట్లు శ్రీరాముని నగలు కాలేదు. దీక్షితుల దగ్గరున్న తాకట్టు రశీదుల సాక్షిగా, కట్టిన వడ్డీ రశీదుల సాక్షిగా భద్రంగా ఉన్నాయి. అవి శ్రీవారి సన్నిధికి తిరిగి చేరతాయి.
ఈ నగల తాకట్టులో తప్పుడు లెక్కలను చూపించలేదు. శ్రీవారి ఆభరాణాల నుంచి వజ్రాలు, కెంపులు, పగడాలు రాలిపోతే పది రూపాయల ఖరీదులను రాసేరట! విశాఖపట్టణం బీచ్ లో అమ్మే సముద్ర గవ్వలు కూడా పది రూపాయలకు రాని రోజుల్లో నగనుంచి మాయమైన వజ్రం విలువ ఐదొందలని, విలువైన రాళ్ళు పది రూపాయలని లెక్కలు రాసే సాహసం చేయలేదు. సంవత్సరాలు గడచిపోతున్నా డాలర్ల దొంగలెవరో తేల్చలేని దద్దమ్మ దర్యాప్తు అధికారులూ లేరు. విషయం తెలియగానే పోలీసులు, దేవస్థానం అధికారులు, రాజకీయ నాయకులు రంగంలోకి దూకేశారు. రమణ దీక్షితులను కటకటాల్లోకి నెట్టేశారు. దీక్షితుల తాకట్టు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జరిగి తీరాల్సిందే..తప్పదు..కానీ, మానవత్వం కూడా ఏదైనా చేయాలేమో? ఏమో??
Pages: -1- -2- 3 News Posted: 23 August, 2009
|