రిలయన్స్ పై చిరు నిప్పులు కాకినాడ : 'ఈ నేల మనది... ఈ నీరు మనది... భూమిలో ఉన్న నిక్షేపాలూ మనవే', 'గ్యాస్ మనది... క్యాష్ వాళ్ళకా?', 'మన రాష్ట్రంలోని సహజ వనరుల సంపదను గుజరాత్ ప్రభుత్వం అన్యాయంగా దోచుకుపోతోంది. అయినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం దద్దమ్మలా వ్యవహరిస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టు ఏదీ నాలుగేళ్ళలో పూర్తి కాలేదు. మన గ్యాస్ ను దొంగలా దోచుకుపోయేందుకే రిలయన్స్ సంస్థ ఇంత వేగంగా పనులు పూర్తి చేసింది. భావి తరాల అభివృద్ధి కోసం మన పూర్వీకులు భూమిలో లంకె బిందెలు దాస్తే వాటిని దొంగలు ఎత్తుకుపోయిన విధంగా రిలయన్స్, గుజరాత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి. ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడికి, వైఎస్ రాజశేఖరరెడ్డికీ కూడా బాగా తెలుసు. అయినా వారిద్దరూ నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారం'టూ ప్రజారాజ్యం పార్టీ అధినేత కొణిదెల చిరంజీవి నిప్పులు చెరిగారు. అడ్డగోలుగా రిలయన్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ను తరలించుకుపోతున్నందుకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద శనివారం మధ్యాహ్నం ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాలో చిరంజీవి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రిలయన్స్ సంస్థపైన, వైఎస్, చంద్రబాబు తీరుపైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
రిలయన్స్ గ్యాస్ ద్వారా మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాను సాధించుకునే వరకూ ఉద్యమాన్ని ప్రజారాజ్యం పార్టీ కొనసాగిస్తుందని చిరంజీవి పేర్కొన్నారు. మన ప్రాంత హక్కులు సాధించుకునే ఉద్యమంలో పాల్గొనేందుకు యువత ఉత్సాహంగా ముందుకు రావాలని చిరంజీవి పిలుపునిచ్చారు. మన ప్రాంతంలో లభ్యమవుతున్న సహజ గ్యాస్ నుంచి ప్రతి ఇంటికీ పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేయాలని చిరంజీవి డిమాండ్ చేశారు. మొన్నటి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 'ఇంటింటికీ గ్యాస్' హామీ ఉత్త గ్యాస్ మాత్రమే అని ఆయన ఎద్దేవా చేశారు. గ్యాస్ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవ్ రా తాపీగా చెబుతున్నారని, అయితే రిలయన్స్ సంస్థ మొత్తం గ్యాస్ ను తరలించుకుపోతుంటే చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. రిలయన్స్ సంస్థ చేతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలుబొమ్మలుగా మారిపోయాయని చిరంజీవి దుమ్మెత్తిపోశారు.
Pages: 1 -2- -3- News Posted: 29 August, 2009
|