రిలయన్స్ పై చిరు నిప్పులు
'ఈ నేల మనది... ఈ గ్యాస్ మనది' అని ప్రతి ఒక్కరం నినదిద్దామని చిరంజీవి పిలుపునిచ్చారు. మన గ్యాస్ ను మనం దక్కించుకుందామన్నారు. సహజ వనరులు ఏ ప్రాంతంలో బయటికి తీస్తే ఆ ప్రాంతానికి 50 శాతం నిధులను వాటా ఇవ్వాలని, వాటిలో మళ్ళీ 40 శాతం నిధులను పూర్తిగా స్థానికంగా అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలని 12వ ఆర్థిక సంఘం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ దాన్ని ఈ ప్రభుత్వాలు, రిలయన్స్ సంస్థ తుంగలో తొక్కేసినట్లు చిరంజీవి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మా సంపదను దోకుచుపోండి అంటూ 1999లో చంద్రబాబు నాయుడు గుజరాత్ ప్రభుత్వానికి రెడ్ కార్పెట్ పరిచారని చిరంజీవి నిప్పులు చెరిగారు. చంద్రబాబు 'విజన్ 2020' ఏమైందని ఆయన ప్రశ్నించారు. బిజెపికి గులాం అయ్యిందా అంటూ ఆయన నిలదీశారు. మన చేతులు కట్టేసి పరాయివాళ్ళు మన గ్యాస్ ను తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాను కాకినాడ వచ్చానని చిరంజీవి చెప్పారు.
జనం మధ్యనే ఉండాలి, జనంతోనే గడపాలి, జనం ఆశీస్సులు పొందేందుకే ప్రజా సమస్యలపై ప్రజారాజ్యం పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు చిరంజీవి వివరణ ఇచ్చారు. సమస్యలపై మనందరం కలిసికట్టుగా ఉద్యమిద్దామని చిరంజీవి పిలుపునిచ్చారు. జనాన్ని, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా స్వార్థంతో వ్యవహరిస్తున్న పార్టీలు, నాయకుల గుండెల్లో దడపుట్టించాలని ఆయన నినదించారు.
గ్యాస్ ను బయటికి తీయడం వల్ల చేపలు చనిపోతున్నాయని, దీనితో మత్స్యకారులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక, జీవనం సాగే పరిస్థితి కనిపించక దీనంగా బతుకులు వెళ్ళదీస్తున్న మత్స్యకారులను చూస్తే గుండె తరుక్కుపోతోందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారందరికీ ప్రజారాజ్యం పార్టీ అండగా నిలుస్తుందని చిరంజీవి హామీ ఇచ్చారు. గ్యాస్ వెలికి తీస్తున్నందున పచ్చటి పొలాలన్నీ ఎండిపోతున్నాయని, ఎకరం కొబ్బరితోట ఉంటే కుటుంబం మొత్తం సుఖంగా జీవించే వీలుందని, అయితే, అలాంటి కొబ్బరి మొక్కలను కూడా రిలయన్స్ సంస్థ తన దోపిడీకి అడ్డుగా ఉన్నాయంటూ నిర్దాక్షిణ్యంగా తీసిపారేస్తోందని ఆరోపించారు.
Pages: -1- 2 -3- News Posted: 29 August, 2009
|