ప్రజానాడిని పట్టిన వైఎస్ తన రాజకీయ పథంలో ఏనాడు ఓటమి ఎరుగని వైఎస్ 1980 దశకంలో మార్పుకోసం పరితపించేవారు. ప్రగతిని త్వరితగతిన సాధించాలని కాంక్షించే రాజీవ్ గాంధీ, రాజేష్ పైలెట్ లతో సాన్నిహిత్యం ఉంది. వీరు ముగ్గురు కూడా ఎదుగుతున్న దశలోనే మరణించారు. 'ఆయన రైతు. అదే సమయంలో పరిశ్రమల గురించి కూడా బాగా తెలుసు' అని కేంద్రమంత్రి సచిన్ పైలెట్ వైఎస్ గురించి వ్యాఖ్యానించారు. భారతీయుల జీవిత విధానంలోని వైవిధ్యం ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని అంబికాసోని నివాళులర్పించారు. మండలానికి పదిమంది కార్యకర్తలు వంతున వెయ్యి మండలాల్లోని కార్యకర్తలను వైఎస్ పేరుపేరునా పలకరిస్తారని రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్టతకు అదే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.
రాత్రివేళ త్వరగా నిద్రకు ఉపక్రమించి వేకువజామున నాగులు గంటలకే లేచే జనప్రియ నాయకుడు వైఎస్ కొద్ది సేపు వ్యాయామం చేస్తారు. గ్రీన్ టీ తాగుతూ పత్రికల పఠనంతో పాటు అవసరమైన వారితో ఫోన్ లో చర్చిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే ఆయన - మంత్రివర్గ సభ్యులతో కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని సలహా ఇచ్చేవారు.
2004లో అధికారంలోకి వచ్చాక చేపట్టిన జలయజ్ఞాన్ని - ధనయజ్ఞంగా కొందరు విమర్శించారు. ఆరోగ్యశ్రీని - కార్పొరేట్ శ్రీగా అభివర్ణించారు. సిమెంటు, గనులు, మీడియా సామ్రాజ్యాలను అధికారం అండతో నిర్మించుకున్నారని 'ప్రత్యర్థి లోకం' కోడై కూసింది. కానీ ఇవేవీ కూడా 2009లో తిరిగి అధికారంలోకి రాకుండా వైఎస్ ను అడ్డుకోలేకపోయాయి. అధికారంలోకి వచ్చాక... ఆందులోని ఆనందాన్ని అనుభవించకుండా - 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు తెచ్చేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే లక్ష్యంతో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు పథకాలపై దృష్టి పెట్టారు. జనబాహుళ్యంలో పట్టు చెదరకుండా ఉండేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమాన్ని రూపొందించారు. కానీ ఇంతలోనే ఆయన ఆశయాలన్ని భగ్నం చేస్తూ మృత్యుదేవత వరించింది. రాష్ట్రంలో అశేష ప్రజల్నీ, కాంగ్రెస్ శ్రేణుల్నీ పుట్టెడు విషాదంలో ముంచింది.
Pages: -1- -2- 3 News Posted: 4 September, 2009
|