నక్సల్స్ ను తరిమిన వైఎస్ అగ్రస్థాయి నేతలను అతి తక్కువ వ్యవధిలో పోగొట్టుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఇక ఇక్కడ పప్పులు ఉడకవని గ్రహించింది. నాయకులను, దళాలను నష్టపోతూ ఆంధ్రాలో సమయం వృధా చేసుకోవడం అనువసరం అని భావించిన మావోయిస్టు వ్యూహకర్తలు తమ ఉద్యమాన్ని ఇతర ప్రాంతాలలో నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఆంధ్రా కామ్రేడ్లు బెంగాల్ లోకి వచ్చారని ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ పోలీస్ అధికారి వాపోయాడు. మావోయిస్టు ఉద్యమ అగ్రనేత, ఆ పార్టీ అఖిల భారత కార్యదర్శి ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, కృష్ణాజీ బెంగాల్ ను తరచుగా సందర్శిస్తూ అక్కడ ఉద్యమాన్ని నడుపుతున్న సుశీల్ రాయ్, పతీత్ పావన్ హాల్దేర్ లకు సాయం చేయడం ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఏర్పడని నేపథ్యంలో మావోయిస్టులు తమ మనుగడను సాగించుకోవడానికి బెంగాల్ కంటే అనుకూలమైన రాష్ట్రం మరొకటి దొరకదని ఆ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.
ఆంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఛత్తీస్ ఘడ్ కు తరలిపోయారు. బస్తర్ లో బలమైన ఆధిపత్యాన్ని సాధించారు. ఆ పార్టీ అగ్రనేత గణపతి ఛత్తీస్ ఘడ్ లోనే ఆశ్రయం తీసుకున్నాడని భావిస్తున్నారు. ఆంధ్రరాష్ట్రంలో ఉండి గ్రేహౌండ్స్ కదలికలను తెలుసుకోవడం కంటే ఛత్తీస్ ఘడ్ నుంచి పసిగట్టడమే వారికి సులువుగా ఉందని అంటున్నారు. గత మే నెలలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ రెడ్డిని ఆంధ్రా పోలీసులు చంపేసినప్పుడు మావోయిస్టులు ప్రతీకారంగా జార్ఖండ్ లో రక్తపాతం సృష్టించారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తెలుగు మాట్లాడే మావోయిస్టులే తమ ప్రాంతంలో అధికంగా ఉన్నారని వారు ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా ప్రాంతాలలో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారని జార్ఖండ్ ఐజీ ఎస్ ఎన్ ప్రధాన్ వివరిస్తున్నారు. తమ ప్రాంతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేతల్లో చాలా మంది ఆంధ్రావారేనని, బెంగాల్, బీహార్, జార్ఖండ్ కేడర్ ముప్పై శాతానికి మించదని వివరించారు. తక్కువ స్థాయి హోదాలో ఉన్న మావోయిస్టులు జార్ఖండ్, బెంగాల్ కు చెందిన వారు ఉంటారని మరో అధికారి చెప్పారు.
Pages: -1- 2 -3- News Posted: 4 September, 2009
|