2004లో రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టగానే మావోయిస్టులను శాంతి చర్చలకు పిలిచింది. జాతీయ స్థాయిలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్న శక్తులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఏమైనా ఆ చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వంతో శాంతి చర్చలకోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన మావోయిస్టు అగ్రనేతలందరూ మళ్ళీ అడవుల్లోని తమ రహస్య స్థావరాలకు వెళ్ళిపోయారు. సహజంగానే పోలీసులు వారి జాడలను పసిగట్టగలిగారు. ఐజీ స్వర్ణజిత్ సేన్ నాయకత్వంలోని గ్రేహౌండ్ కమెండోలు నల్లమల కీకారణ్యంలోకి దూసుకుపోయి పెద్ద నాయకులందరినీ నేలకూల్చారు. రహస్య స్థావరాలను ధ్వంసం చేశారు. మావోయిస్టు ఆయుధాల డంప్ లను పెద్ద ఎత్తులో స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 800 మంది నక్సలైట్లు లొంగిపోయేలా చేశారు.
తాము పేదల పక్షాన పోరాడడానికే బెంగాల్ తదితర రాష్ట్రాలకు వెళ్ళామని త్వరలోనే ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి వస్తామని మావోయిస్టు అగ్రనేత మల్లోజుల ఇటీవలే ప్రకటించారు. అలానే మావోయిస్టులపై వైఎస్ రాజశేఖరరెడ్డి సాధించిన విజయాలను కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది. అంతేకాకుండా ఆంధ్రా తరహాలోనే మావోయిస్టు గెరిల్లా దళాలను ఎదుర్కోవడానికి మిగతా రాష్ట్రాలు కూడా గ్రేహౌండ్స్ దళాలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. దానికి అవసరమైన నిధులను కూడా మంజూరు చేసింది. ఏది ఏమైనా మావోయిస్టులను అణచి వేయడంలో వైఎస్ సాధించిన ఘన విజయం పొరుగు రాష్ట్రాలకు మాత్రం పక్కలో బల్లెంలా మారింది.