జగన్...ఓ సంచలనం ఇప్పుడు ఆ జగన్ రాష్ట్ర అత్యునత పదవి కోసం పోటీలో నిలుచుని ఉన్నారు. ఆయన తన భవిష్యత్ వ్యాపార వ్యవహారాలను అభివృద్ధి చేస్తారో లేదో తెలియదు. కానీ ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించితే మాత్రం బలమైన స్వంత ప్రసారసాధనాలు కలిగిన ఏకైక ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఆయన చరిత్ర సృష్టించనున్నారు. ఆయన యాజమాన్యంలో ఉన్న తెలుగు దినపత్రిక 'సాక్షి', తెలుగు న్యూస్ ఛానల్ 'సాక్షి' రాష్ట్రంలో ఇప్పటికే బలమైన మీడియాగా రూపుదిద్దుకున్నాయి. ఆశ్చర్యం ఏమీ లేదు గాని ప్రభుత్వం ప్రకటనల రూపంలో వీటికి చాలా ఉదారంగా సహాయం అందచేస్తూ వచ్చింది.
ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలన్న జగన్ తహతహ ఈనాటిది కాదు. గత ఐదారేళ్ళుగా వ్యాపారాల్లో తలమునకలై ఉన్నప్పటికీ రాజకీయాలపై ఓ కన్నేసే ఉంచారు. 2004లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి తండ్రి వైఎస్ ముఖ్యమంత్రి పదవిని అలంకరించగానే జగన్ రాజకీయ అరంగేట్రానికి చాలా ఉబలాటపడ్డారు. కడప ఎంపిగా గెలిచిన చిన్నాన్న వివేకానందరెడ్డి చేత రాజీనామా చేయించి, ఉపఎన్నికలో తాను నిలవాలని ప్రయత్నించారు. కానీ వివేకానందరెడ్డి దానికి సుముఖత వ్యక్తం చేయకపోవడం, కాంగ్రెస్ అధిష్టానం కూడా అనవసరంగా ఉపఎన్నికలను ప్రజల మీద రుద్దకూడదని భావించడంతో జగన్ వెనక్కు తగ్గారు.
ఐదేళ్ల తరువాత జగన్ తన ఆశకు జీవం పోశారు. 2009 ఎన్నికలు ముంచుకురాక మునుపే కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అడుగుడుగునా ఆయన నిలువెత్తు కటౌట్లు నిలిచాయి. కడప ఎంపీగా యువకుడు కావావని కాంగ్రెస్ యూత్ బ్రిగేడ్ కార్యకర్తలు నినదించారు. ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో 'వియ్ వాంట్ జగన్'అన్న నినాదాలను హోరెత్తించారు.ఇక వివేకానందరెడ్డికి అన్న కుమారుని కోసం మార్గాన్ని సుగమం చేయకతప్పలేదు. దానికి కానుక గానే వివేకానందరెడ్డికి శాసనమండలిలో ఇటీవలే స్థానం కల్పించారు.
అది సరే అసలీ జగన్ శక్తి ఏమిటీ... కేవలం వందరోజుల రాజకీయ జీవితంతో ముఖ్యమంత్రి కావడం ఏమిటీ? నిజానికి జగన్ గత తరం ఆశల్లో, ఆలోచన్లలో, ఊహల్లో భావి తరం నాయకుడు. ఈ దార్శనికత తండ్రి వైఎస్ ది కానే కాదు. జగన్ తాత రాజారెడ్డిది. కడప జిల్లాలో అత్యంత శక్తిమంతుడైన రాజారెడ్డి ఊహల్లో మనుమడు జగన్ నిజమైన వారసుడు. తన కొడుకు రాజశేఖర్ రెడ్డి మరీ సున్నితమైన వాడని రాజారెడ్డి భావన. తన మనుమడే రాష్ట్ర రాజకీయాల్లో తన వారసుడని రాజారెడ్డి ప్రగాఢంగా విశ్వసించేవారు. అంటే దానర్ధం జగన్ వ్యక్తిగతంగా కఠినాత్ముడని కాదు.
Pages: -1- 2 -3- News Posted: 5 September, 2009
|