సిఎం పదవిపై బొత్స ఆశ! హైదరాబాద్: వైఎస్ మరణాంతరం రాష్ట్ర కాంగ్రెస్ లో అనూహ్యమైన, ఆశ్చర్యకర పరిణామాలు తెరవెనుక జోరుగా జరిగిపోతు న్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో రాజకీయ పరమపద సోపానాన్ని తిరుగులేని విధంగా అధిరోహించి, ఆయనకు అనుంగ అనుచరుడిగా ముద్ర వేయించుకున్న మంత్రి బొత్స సత్య నారాయణ తాజాగా ముఖ్యమంత్రి పదవి కోసం తెరవెనుక పావులు కదుపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. ఒకవైపు జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలన్న లాబీతో ఉంటూనే చాపకింద నీరులా మరోవైపు తనకూ ఆ అవకాశం దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఏ కారణం చేతనయినా జగన్‌కుఅవకాశం రాకపోతే, ఆ తర్వాత వరసలో బిసి కార్డుతో తానూ రేసులో ఉండాలని ఆయన భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ అండతో విజయనగరం జిల్లాపై తిరుగులేని పట్టు సాధించిన బొత్స, ఆయన ఆశీస్సులతోనే పిసిసి అధ్యక్షుడవుతారన్న ప్రచారం కూడా గతంలో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైఎస్ జీవించిలేరు కాబట్టి, బిసి కోటాలో తానూ ముఖ్యమంత్రి పదవికి అర్హుడననే భావనతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
పైకి జగన్‌ను సిఎంగా చేయాలని ప్రయత్నిస్తున్న ఆయన...ఒకవేళ ఆ ప్రయత్నాలు విఫమలయితే ఇతరులకు ఆ పదవి వెళ్లే అవకాశం ఉన్నందున, పార్టీకి చాలాకాలం నుంచి సేవలందిస్తున్న తాను ముఖ్యమంత్రి అయితే తప్పేమిటన్న భావనతోనే బహుశా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. శనివారం ఆయన తన నివాసంలో జగన్‌ను సిఎం చేసేందుకు మంత్రులతో సమావేశం ఏర్పాటుచేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, అదే సమయంలో జగన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం సాధ్యపడకపోతే..రేసులో తాను నిలిస్తే మిగిలిన వారి నుంచి ముందస్తు మద్దతు కోసమే ఆయన ఆ సమావేశం ఏర్పాటుచేసి ఉంటారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆయన.. సిఎం రేసులో ఉన్నారని భావిస్తోన్న కె.కేశవరావు వద్దకు వెళ్లి చర్చలు జరపడం చర్చనీయాంశమయింది. ఇద్దరూ అటు ఇటుగా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడమే దానికి కారణం.
Pages: 1 -2- News Posted: 6 September, 2009
|