సిఎం పదవిపై బొత్స ఆశ! రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, బలప్రదర్శనలు, సీనియర్ల వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంతో ఉంది. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తున్న డిమాండ్లు, సంతకాల సేకరణ వ్యవహారాలు, దీనికి సంబంధించి సీనియర్లు చేస్తున్న ప్రకటనలపై అధినేత్రి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆ మేరకు వైఎస్ సంతాపదినాలు ముగిసే వరకూ ఎలాంటి ప్రకటనలు, ప్రయత్నాలు చేయవద్దని విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా, వైఎస్ వారసుడి ఎంపికకు సంబంధించి సీనియర్లు చేసిన వ్యాఖ్యలను కూడా నాయకత్వం సీరియస్‌గా తీసుకుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా తెరపైకొచ్చిన కొత్త వాదాలు, వాదనలతో పార్టీకి నష్టం జరుగుతుందని, స్వయంగా నాయకత్వం ఒక నిర్ణయం తీసుకునేంత వరకూ ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించింది. ఇంకా వైఎస్ సంతాపదినాలు కూడా పూర్తి కాకముందే, సిఎం పదవిపై రాద్ధాంతం జరుగుతోందన్న చెడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడం మంచిదికాదని అధిష్టానం భావిస్తోంది. దీనిపై ముందుగానే హెచ్చరించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి వీరప్ప మొయిలీ తాజాగా దీనికి తెరదించే ప్రయత్నాలు చేశారు. సిఎం ఎంపికలో సిఎల్‌పిదే కీలకపాత్ర అని శనివారం స్పష్టం చేశారు.
బొత్స ఇంట్లో మంత్రుల భేటి
వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయక పోతే తమ పదవులకు రాజీనామా చేస్తామంటూ పలువురు మంత్రులు హెచ్చరించారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పి.రామచంద్రారెడ్డి ఇప్పటికే ఈ హెచ్చరిక చేయగా, తాజాగా శనివారం మరో ఇద్దరు మంత్రులు సయ్యద్ అహ్మదుల్లా, జూపల్లి కృష్ణారావు సైతం అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్ ఆశయన సాధనకు, రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించడానికి వైఎస్ జగన్ లాంటి వ్యక్తి సిఎంగా ఉంటే ఎంతో ఉపయోగకరమని, అనేక కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించి, ప్రజల గుండెల్లో వైఎస్ నిద్రపోయారని, ఇలాంటి సమయంలో జనం జగనే సిఎం కావాలని కోరుకుంటున్నారని వారు పేర్కొన్నారు. జగన్‌ను సిఎం చేయక పోతే తాము పదవులకు రాజీనామా చేస్తామని వారు అధిష్టానానికి హెచ్చరించారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో శనివారం పలువురు మంత్రులు సమావేశమైనట్లు సమాచారం. కన్నాలక్ష్మినారాయణ, వట్టి వసంతకుమార్, బాలరాజు, జూపల్లి కృష్ణారావు, తదితరులు సమావేశమైనట్లు తెలిసింది. ప్రజలందరు జగన్ ఉండాలని కోరుతున్న తరుణంలో అధిష్టాన నిర్ణయంతో పనిలేదని, సిఎం పదవి అభ్యర్ధిత్వం కోసం జగన్‌ను సమర్ధిస్తూ 20 మంది మంత్రులు చేసిన తీర్మానా ప్రతిని వీరు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ తీర్మానాన్ని ఢిల్లీకి ఎప్పుడు పంపించాలనేది నిర్ణయం తీసుకోక పోయినా ఆదివారం జరిగే పీసీసీ సంతాప సభ తరువాతే నిర్ణయం తీసుకుందామని వారు భావించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
Pages: -1- 2 News Posted: 6 September, 2009
|