పులివెందులకు నిధుల చింత! వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులివెందుల మాత్రమే కాకుండా కడప జిల్లా మొత్తంగా కూడా అభివృద్ధి ఫలాలను అందుకుంది. ముఖ్యంగా విద్యారంగంలో 2008లో ప్రొద్దుటూరులో ఇంజనీరింగ్ కాలేజీ, కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయం కూడా వైఎస్ హయాంలోనే మంజూరైంది. 100 ఎకరాల విస్తీర్ణంలో పశువైద్య కళాశాల ఏర్పడింది. అలాగే రాజీవ్ గాంధీ వైద్య శాస్త్రాల సంస్థను కడపలో నెలకొల్పారు. వీటితో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, పలు క్రీడా పాఠశాలలు కడపకు తరలివచ్చాయి. ఇదంతా కూడా వైఎస్ ముఖ్యమంత్రి కావడం వల్లనే సాధ్యమైందన్నది విద్యావేత్తల అభిప్రాయం.
రాజశేఖర్ రెడ్డి మహాప్రస్థానం చేసిన ఆయన తలపులపాయ - ఇడుపులపాయలో రాజీవ్ గాంధీ నాలెడ్జి టెక్నాలజీ యూనివర్శిటీని నెలకొల్పారు. తన జిల్లాకు నిధుల కేటాయింపు పట్ల చూపిన శ్రద్దను ఒక విద్యావేత్త ప్రస్తావిస్తూ 'ఉస్మానియా వర్శిటీ వంటి సంస్థలకు గత ఏడాది 90 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయిస్తే... కడప జిల్లాలోని సంస్థలకు 320 కోట్ల రూపాయలను కేటాయించారు. 2009లో 600 కోట్ల రూపాయలకు పెరిగింది' అని గుర్తు చేశారు. ఈ క్రమంలో కడప జిల్లాలోని విద్యావేత్తలు, విద్యా సంస్థల ఉద్యోగులు వైఎస్ స్థానంలో ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయితేనే... తమ జిల్లాలో నెలకొల్పిన విద్యాసంస్థలు నిలదొక్కుకోగలవని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం జగన్ ముఖ్యమంత్రి కావాలని కడపజిల్లా వాసులు - ముఖ్యంగా విద్యారంగంలోని వారు కోరుకుంటున్నారు.
Pages: -1- 2 News Posted: 7 September, 2009
|