రాహుల్ కు విజయ్ షాక్ చెన్నై : సుప్రసిద్ధ తమిళ యువ నటుడు విజయ్ ను చేర్చుకోవడం ద్వారా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపచేయాలన్న పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపి రాహుల్ గాంధి ఆలోచనలకు విజయ్ చివరి క్షణంలో మనస్సు మార్చుకోవడంతో గండి పడింది. రాహుల్ తమిళనాడులో మూడు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్న తరుణంలో విజయ్ వెనుకకు తగ్గారు. 35 సంవత్సరాల విజయ్ ఇలా హఠాత్తుగా మనసు మార్చుకోవడం వెనుక రాష్ట్రంలోని అధికార పక్షం డిఎంకె హస్తం ఉందని భావిస్తున్నారు. బుధవారం మదురైకి రావలసి ఉన్న రాహుల్ గాంధితో కలసి గురువారం కోయంబత్తూరులో ఒక బహిరంగ సభలో పాల్గొనగలనని విజయ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి తెలియజేశారు.
ఈ బహిరంగ సభలోనే విజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరగలరని అనేక మంది ఆశించినప్పటికీ, రాహుల్ తో కలసి సభకు హాజరు కావడమనేది విజయ్ ఉద్దేశానికి సూచిక మాత్రమేనని, ఆయన ఆతరువాత పార్టీలో లాంఛనంగా చేరగలరని ఆయన సన్నిహిత వర్గాలు వివరించాయి. 48 చిత్రాలలో నటించిన విజయ్ రాజకీయ అరంగేట్రం ఆయన తాజా చిత్రం, దీపావళికి విడుదల కానున్న 'వేట్టైకారన్' (వేటగాడు)కు అదనపు ప్రోత్సాహకంగా ఉద్దేశించినదే. ఎందుకంటే విజయ్ చివరి మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమై, తమిళ సినిమా రంగంలో టాప్ 5 బాక్సాఫీసు హిట్ తారలలో ఒకడు కావడానికి ఆయన సత్తాపై సందేహాలు తలెత్తిన తరువాత వస్తున్న చిత్రం అది.
విజయ్ ఆగస్టులో ఢిల్లీలో రాహుల్ గాంధిని కలుసుకున్నారు. విజయ్ ను తమిళనాడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుని చేయగలనని అప్పుడు రాహుల్ హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఎందుకంటే అప్పటికే రాజకీయాలపై ఆసక్తి కలిగి, తన అభిమాన సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చడానికి విజయ్ మక్కళ్ ఇయక్కం (విజయ్ ప్రజా ఉద్యమం)ను ఏర్పాటు చేసిన విజయ్ కు రాహుల్ ఆహ్వానం సరైన తరుణంలో వచ్చిందని భావించారు.
కొత్త సభ్యులను చేర్పించే కార్యక్రమానికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ ను పురికొల్పిన రాహుల్ గాంధి జనంలో ముఖ్యంగా యువతలో విజయ్ పట్ల గల అభిమానాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి బలం పుంజుకోవడానికి ఉపయోగపడగలదని భావించారు. 1967లో ఎన్నికలలో ఓడిపోయిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ద్రావిడ పార్టీల కన్నా బాగా వెనుకబడిపోయింది.
నటుడు విజయకాంత్ పార్టీ డిఎండికెను కాంగ్రెస్ లోకి విలీనం చేయించుకోలిగితే మరింత ప్రయోజనకరం అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తన మిత్ర పక్షం డిఎంక సాయం లేకుండానే 2011 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసేందుకు ధైర్యం కూడా చేయగలదు.
Pages: 1 -2- News Posted: 8 September, 2009
|