రాహుల్ కు విజయ్ కాంత్ షాక్
అయితే, డిఎంకె ఆలోచనలు వేరు. ఎం. కరుణానిధి ప్రభుత్వానికి ప్రాణం పోస్తూ మద్దతు ఇస్తున్నప్పటికీ అధికారంలో వాటా కల్పించనందుకు ఇప్పటికే కుందుతున్న కాంగ్రెస్ తిరిగి జవజీవాలు సంతరించుకుని తన అధికారాన్ని సవాల్ చేసే స్థితికి రాకూడదని డిఎంకె భావిస్తున్నది. అందుకే ఈ దిశగా తొలి చర్య అన్నట్లుగా చెన్నైలో విజయ్ కాంత్ ఆధ్వర్యంలో గల ఒక కల్యాణ మంటపానికి పోలీసుల నుంచి రెండు వారాల క్రితం ఒక నోటీస్ అందింది. రోడ్డుపై ట్రాఫిక్ కు అవరోధంగా ఉన్న ఒక పందిరిని తొలగించాలని పోలీసులు ఆ నోటీస్ లో కోరారు.
అయితే, విజయ్ కాంత్, ఆయన తండ్రి, సినీ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్ ఇందుకు ఏమాత్రం చలించలేదు. దీనితో డిఎంకె తదుపరి ఆయుధాన్ని ఉపయోగించింది. డిఎంకెకు సన్నిహితుడుగా భావిస్తున్న నిర్మాత ఒకరు చంద్రశేఖర్ ను కలుసుకుని విజయ్ కాంత్ కనుక కాంగ్రెస్ తో లాలూచీ పడడం కొనసాగించిన పక్షంలో భవిష్యత్తులో ఆయన చిత్రాలు వేటికీ థియేటర్లు దొరకవని బెదరించారు.
ఒక స్టార్ గా విజయ్ కాంత్ భవితవ్యం 'వేట్టైకారన్'పై ఆధారపడి ఉన్నందున తమ రాజకీయ ఆకాంక్షలను తాత్కాలికంగానైనా పక్కన పెట్టాలని తండ్రీ కొడుకులు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయమేమంటే ఆ చిత్రాన్ని కరుణానిధి బంధువులైన మారన్ ల యాజమాన్యంలోని సన్ పిక్చర్స్ కొనుగోలు చేయడం.
'ప్రస్తుతం మీడియాలో ఎవరితోనూ మాట్లాడే స్థితిలో నేను లేను' అని చంద్రశేఖర్ ఈ విషయమై తన వ్యాఖ్య కోసం సంప్రదించిన ఒక మీడియా ప్రతినిధితో ఫోన్ లో చెప్పారు. అయితే, రాష్ట్రంలోని అధికార పార్టీ నుంచి ఈ విధంగా బహిరంగ బెదరింపులు వస్తున్న నేపథ్యంలో తమ పోరాటాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిదని విజయ్ కాంత్ నిర్ణయించుకున్నట్లు ఆయనకు సన్నిహితుడైన ఒక దర్శకుడు చెప్పారు. 'రాహుల్ గాంధితో చేతులు కలపాలన్న ఆయన నిర్ణయాన్ని వాయిదా వేశారంతే. పూర్తిగా విరమించుకోలేదు' అని దర్శకుడు వివరించారు.
ఇక కాంగ్రెస్ వేచి చూసే వైఖరిని అనుసరించాలని అనుకుంటున్నది. కాని, విజయ్ కాంత్ ఆలోచనలతో నిమిత్తం లేకుండా తన యువజన విభాగం సభ్యత్వ కార్యక్రమాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ నిశ్చయించింది. 'మాకు వస్తున్న స్పందన అమోఘం. ముఖ్యంగా గ్రామాలలో ఇది బాగా ఉంది. అక్కడ రాహుల్ యువత అభిమానాన్ని చూరగొన్నారు. అందువల్ల ప్రస్తుతానికి మేము ఈ విషయంలో పురోగమిస్తాం. ఒక వేళ విజయ్ కాంత్ తరువాత మాతో కలిస్తే అది మాకు బోనస్ కాగలదు' అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సి. జ్ఞానదేశికన్ చెప్పారు.
Pages: -1- 2 News Posted: 8 September, 2009
|