ఎంతటి నిర్లక్ష్యం! హైదరాబాద్ : అలసత్వం, నిర్లక్ష్యం, ఉదాసీనత... ఉన్నత స్థాయి అధికారులు పేరుకు పోయిన ఈ ధోరణులే వైఎస్ ను బలి తీసుకున్నాయని అటు రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు ఇటు వైఎస్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. బాధ్యతా రాహిత్యం బాగా పెరిగిపోయిందని, ఉన్నత పదవులను అలంకరించాలన్న ఆశే తప్ప బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్న భావన కొరవడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో ముఖ్యమంత్రి వైఎస్ చనిపోతే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కనీసం ఇప్పటివరకూ సంఘటనా స్థలాన్ని చూడకపోవడమే వారి బాధ్యతా రాహిత్యానికి ప్రత్యక్ష తార్కాణమని అంటున్నారు. రాష్ట్ర డీజీపీ ఎస్ ఎస్.పి యాదవ్, ఇంటిలిజెన్స్ అదనపు డీజీ అరవిందరావు తమ అధికారాలను ప్రదర్శించుకోవడంలో చూపే శ్రద్ధ, బాధ్యతలను నిర్వర్తించడంలో ఎక్కడ ప్రదర్శించారని మంత్రులే ప్రశ్నిస్తున్నారు. ఈ ఇద్దరిపై వేటు వేయకపోతే రాష్ట్ర వ్యవహారాలు మరింత దిగజారతాయని మంత్రులు ముక్త కంఠంతో ముఖ్యమంత్రి రోశయ్యకు చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది.
కారు మబ్బుల మధ్య వైఎస్ ప్రయాణం ప్రారంభం కావడం, గంట సేపట్లోనే హెలికాప్టర్ కూలిపోయి వైఎస్ మరణించడంతో ఇంటిలెజన్స్, సివిల్, ఏవియేషన్, పోలీసు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంని విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి హెలికాప్టర్ పర్యటన ప్రారంభమైనప్పటి నుండి ఆయన గమ్య స్థానంలో క్షేమంగా దిగేంతవరకు పరిస్థితులను ఎప్పటికప్పుడు డిజిపి పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్ రెండో తేదీన జరిగిన సంఘటన సమయంలో ఎటువంటి పర్యవేక్షణ లేకుండా పోయిందని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. సంఘటన జరిగి ఇన్నిరోజులైనా ఇప్పటివరకు అత్యున్నత పోలీసు అధికారులు ఎవరూ సంఘటనా స్థలానికి వెళ్ళకపోవడాన్ని ప్రభుత్వం తప్పుపడుతోంది. అంతటి నిర్లక్ష్యం వహించిన వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని కూడా మంత్రులు చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వానికి తలవంపులు, ఆవేదన కలిగించిన ఈ సంఘటనపై కొద్ది రోజులలోనే పలువురు సీనియర్ అధికారుల పై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని సీనియర్ మంత్రి ఒకరు చెప్పారు. యాదవ్ ను మార్పు చేయాలని నిర్ణయిస్తే ఆ పదవిని ఎవరికి కట్టబెట్టాలన్న ప్రశ్న ఉదయిస్తుంది. గత ఎన్నికల సమయంలో యాదవ్ స్థానంలో డిజిపి గా పనిచేసిన ఎకె మహంతికి ఈ బాధ్యతలు మళ్ళీ అప్పగించేందుకు ప్రభుత్వం ఎంత వరకు సుముఖంగా ఉంటుందన్నది మరో ప్రశ్న. నిబంధనలను తూచా తప్పకుండా ఆచరించే అధికారులు ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని మంత్రులు, కొన్ని శాఖల అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Pages: 1 -2- News Posted: 8 September, 2009
|