సైంటిస్ట్ పై కక్ష
1997లో నైపర్ లో చేరే ముందు నార్త్ బెంగాల్ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ పొందిన అనిమేష్ రాయ్ ఈ వార్తా కథనంపై 'ది టెలిగ్రాఫ్' విలేఖరితో మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే, బెనర్జీ దగ్గర నుంచి తనను బదలీ చేయవలసిందిగా రాయ్ 2003లో విజ్ఞప్తి చేసినప్పటి నుంచి ఈ సంక్షోభం సాగుతున్నదని ఆ బృందం నివేదిక ద్వారా విదితమవుతున్నది.
బెనర్జీ పరిశోధన పరంగా అక్రమాలకు పాల్పడిన ఉదంతాలు తన దృష్టికి వచ్చాయని రాయ్ నైపర్ డైరెక్టర్ కు, ఇతరులకు పంపిన లేఖలలో తెలిపారు. రాయ్ లేబరేటరీ నోటుపుస్తకాలను పరిశీలించగా, రాయ్ కు గుర్తింపు ఇవ్వకుండానే ఆయన పరిశోధనాంశాలు కొన్నిటిని 2005లో బెనర్జీ, ఒక విద్యార్థి తాము వెలువరించిన మూడు పరిశోధన పత్రాలలో పొందుపరిచినట్లు విదితమైందని దర్యాప్తు బృందం వెల్లడించింది.
కాగా, అవార్డు గెలుచుకున్న బయోకెమికల్ ఇంజనీర్, ఐఐడి ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన బెనర్జీ తానేమీ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తాను ప్రచురించిన ఒక సమీక్షా వ్యాసంలో 'ఇక్కడివి, అక్కడివి కొన్ని వాక్యాలు' ఉన్నాయని, అందుకు తాను ఇదివరకే ఒక సైంటిఫిక్ పబ్లిషర్ కు క్షమాపణ తెలియజేశానని ఆయన చెప్పారు. 'అది పెద్ద తప్పేమీ కాదు. కాని అతిగా ప్రచారం చేశారు. దర్యాప్తు బృందం పక్షపాతంతో వ్యవహరించినట్లు ఉన్నది. అది వాస్తవాలన్నిటినీ నిర్థారించుకోలేదు. వివరణ ఇవ్వడానికి అది నాకు అవకాశం కల్పించలేదు' అని బెనర్జీ పేర్కొన్నారు.
దేశీయ పరిశ్రమల కోసం ఔషధ పరిశోధనకు సారథ్యం వహించేందుకై అహ్మదాబాద్, కోలకతా, గౌహతి, హాజీపూర్, హైదరాబాద్, రాయబరేలిలలో ఆరు కొత్త నైపర్ లను నెలకొల్పాలని ప్రభుత్వం యోచిస్తున్న సమయంలో ఈ వివాదం తలెత్తడం గమనార్హం. 'ఇదంతా గందరగోళంగా ఉన్నది. ఉన్నత విద్యా, పరిశోధన కేంద్రాలలో ఇటువంటి పరిస్థితులు నెలకొనడం మంచిది కాదు' అని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ కార్యదర్శి, నైపర్ గవర్నర్ల బోర్డు చైర్మన్ తిరుమలాచారి రామసామి వ్యాఖ్యానించారు.
రాయ్ పునర్నియామకానికి నైపర్ పాలనాధికారుల అభ్యంతరాలు క్రీడా మైదానంలో చోటు కోసం పిల్లలు దెబ్బలాడుకునే చందంగా ఒక దశలో కనిపించాయని ఆ బృందం దర్యాప్తు గురించి తెలిసిన వర్గాలు పేర్కొన్నాయి.
Pages: -1- 2 -3- News Posted: 9 September, 2009
|