జయ ఏకాంతానికి సెంచరీ చెన్నై : అఖిల భారత అణ్ణా డిఎంకె (ఎఐఎడిఎంకె) అధినేత్రి జయలలిత ఏకాంత వాసం శతదినోత్సవం పూర్తి చేసుకున్నది. అదే సమయంలో ఆమె కాళ్ళ కింద నేల క్రమంగా కదలిపోతున్నది. గత సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పొందడంతో కుందుతున్న జయలలిత చెన్నైకి సుమారు 535 కిలో మీటర్ల దూరంలో ఊటీ సమీపాన పర్వతశ్రేణులలోని విశ్రాంతి కేంద్రం కొడనాడులో మే 30 నుంచి కాలం గడుపుతున్నారు. ఆమె ఒక వైపు తనకు తానుగా ఏకాంతంలో గడుపుతుండగా మరొక వైపు ఆమె ప్రథమ శత్రువు డిఎంకె భాగస్వామ్య పక్షంగా ఉన్న ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం నూరు రోజులు పూర్తి చేసుకున్నది.
జయలలిత గడచిన 100 రోజులుగా 862 ఎకరాల సువిశాల తేయాకు, ఏలకుల ఎస్టేట్ లో గల ఒక భారీ శ్వేత భవంతిలో కాలక్షేపం చేస్తున్నారు. ఆ ఎస్టేట్ సంయుక్త యజమానులు జయలలిత, ఆమె అనుంగు స్నేహితురాలు శశికళ.
జయలలిత కొడనాడు నుంచి రిమోట్ కంట్రోల్ తో తన పార్టీని నడుపుతున్నప్పటికీ ఆమె అండ, బలం మరింతగా తరిగిపోతున్నాయి. ఆ రమణీయ పర్వత క్షేత్రంలో కూర్చునే ఐదు శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలను బహిష్కరించాలని తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. వాటిలో మూడు సీట్లు తన కూటమివేనని తెలిసి కూడా ఆమె ఎవరో ఇచ్చిన తప్పుడు సలహాతో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఉప ఎన్నికలు ఆగస్టు 18న జరిగాయి. ఆమె రంగంలో లేని కారణంగా డిఎండికె నేత విజయకాంత్ వోటర్లలో తన బలాన్ని పెంచుకున్నారు. డిఎంకెకు తన పార్టీయే తగిన ప్రత్యామ్నాయమనే తన వాదనకు ఆయన మరింత బలం చేకూర్చుకున్నారు.
ఆ ఉప ఎన్నికల ఫలితాలు డిఎంకె - కాంగ్రెస్ సంకీర్ణానికి అనుకూలంగా వెలువడ్డాయి. అది చాలదన్నట్లుగా జయలలిత ఇద్దరు ఎంఎల్ఎలను బహిష్కరించి శాసనసభలో తన పార్టీ బలాన్ని మరింత తగ్గించుకున్నారు. 234 మంది సభ్యుల అసెంబ్లీలో ఎఐఎడిఎంకె బలం 57కు పడిపోయింది. ఆ ఇద్దరిలో ఒకరు వెంటనే డిఎంకెలో చేరిపోగా మరొకరు డిఎంకె నాయకులతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు.
Pages: 1 -2- News Posted: 10 September, 2009
|