జయ ఏకాంతం... పార్టీకి సుషుప్తి
కాగా, చెన్నైలో జయలలిత లేకపోవడం ఆమె ప్రత్యర్థులు ఆమెపై మరిన్ని విమర్శనాస్త్రాలు సంధించడానికి అవకాశం కల్పించింది. 'కొడనాడులో వాతావరణం ఆమెతో అటువంటి తీవ్ర తప్పిదాలు చేయిస్తున్నట్లున్నది. అదే నిజమైతే, ఆమె అక్కడే ఉండిపోవడమే మాకు కావలసింది' అని డిఎంకె శాసనసభ్యుడు ఒకరు చమత్కరించారు.
అయితే, జయలలిత పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదనే అభిప్రాయం తప్పని ఎఐఎడిఎంకె నాయకులు అంటున్నారు. 'పార్టీ కార్యవర్గం అక్కడ ఒకసారి సమావేశమైంది. పార్టీ సీనియర్ నాయకులు, ఎంఎల్ఎలు చేయవలసిన పనులపై ఆమె దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు తీసుకుంటున్నారు. మేము ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలో మా అధినేత్రి మా నాయకులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఆమె చెన్నైలో ఉంటే ఏమి చేసి ఉండేవారో కొడనాడులో ఉండి అదే చేస్తున్నారు. మరి ఇందులో తప్పేమిటి' అని ఎఐఎడిఎంకె మాజీ మంత్రి ఒకరు అన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థుల జాబితాను జయలలిత అప్పుడే రూపొందించారని పార్టీకి చెందిన మరొక సీనియర్ నాయకుడు తెలియజేశారు. పార్టీ జిల్లా శాఖల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా ఆ ఎన్నికలు ఒక సంవత్సరం ముందుగానే 2010లో జరుగుతాయని ఆమె భావిస్తున్నారని ఆయన చెప్పారు.
ఇక జయలలితను ఎప్పుడూ మద్దతు ఇస్తుండే రాజకీయ వ్యాఖ్యాత చో రామస్వామి ఆమె కొడనాడు నుంచే పార్టీ వ్యవహారాలు చూస్తుండడాన్ని సమర్థించారు. 'ఆమె చెన్నైలో ఉండే అవే నిర్ణయాలు తీసుకుని ఉన్నట్లయితే, ఎఐఎడిఎంకె ఏవిధంగా మెరుగైన ఫలితాలు సాధించి ఉండేది? ఈ కమ్యూనికేషన్ల శకంలో ఎవరైనా ఎక్కడ నుంచైనా కార్యకలాపాలు సాగించవచ్చు. కొడనాడు తమిళనాడులోనే కదా ఉంది' అని ఆయన వాదించారు.
కాగా, శారీరక, మానసిక పునరుత్తేజం కోసం ఆయుర్వేద చికిత్స చేయించుకోవడానికి జయలలిత కొడనాడులో తన మకాంను ఉపయోగించుకుంటున్నారని ఎఐఎడిఎంకె వర్గాలు తెలియజేశాయి. 'ఈ నెల ద్వితీయార్ధంలో ఏలినాటి శని గడువు పూర్తయిన తరువాతే చెన్నైకి తిరిగి రావలసిందిగా ఆమె జ్యోతిష్కులు ఆమెకు సలహా ఇచ్చారు. ముందున్న సమస్యలను మరింత దృఢవిశ్వాసంతో, కొత్త శక్తితో అధిగమించడానికి తమ 'పురట్చి తలైవి' (విప్లవ నాయకురాలు) చెన్నైకి తిరిగి రాగలరని వారి నమ్మకం' అని పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు.
Pages: -1- 2 News Posted: 10 September, 2009
|