జగన్ కాకపోతే రోశయ్యే! హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి వైఎస్ స్థానంలో జగన్ ను కూర్చోబెట్టాలని పట్టుబడుతున్న వైఎస్ వర్గీయులు... అధిష్టానం తగిన విధంగా స్పందించకపోతే ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా వుంది? వైఎస్ అంత్యక్రియలు జరగకముందే సిఎం పదవిని జగన్ కు కట్టబెట్టాలన్న వాదన పట్ల తొలినుంచి అధిష్టానం ఆగ్రహం గానే ఉంది. అయితే, 2004, 2009 ఎన్నికల్లో వైఎస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీఏకి లభించిన ఎంపీ సీట్లు, ఆయన కాంగ్రెస్ కు చేసిన మేలునూ దృష్టిలో పెట్టుకున్న అధిష్టానం - కొంత సంయమనం పాటించింది. సంతాపదినాలు ముగిసి, భావోద్వేగాలు చల్లారాకనే 'తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని' అధిష్టానం ప్రకటిస్తోంది.
మంత్రి మండలిలో సీనియర్, ఇప్పటి వరకు 15 బడ్జెట్లను ప్రవేశపెట్టిన 'ఆర్థికవేత్త', కాంగ్రెస్ కేబినెట్లో 'నెంబర్ టూ'గా అనేకమార్లు పనిచేసిన అనుభవం రోశయ్యకు ఉంది. కాబట్టే సీఎం పదవికి తగిన వ్యక్తిగా గుర్తించిన అధిష్టానం ఆయన మెడలో వరమాల వేసింది. తాత్కాలిక ప్రాతిపదికగా ఈ ఏర్పాటు చేశామని అధిష్టానం అంటున్నా... ఇదే శాశ్వతం కావచ్చని కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ ను ఎలాగైనా సీఎం చేయాలని వైఎస్ 'ఆత్మ' బంధువు కేవీపీ కాలికి బలపం కట్టుకొని... ఢిల్లీలోని కీలక నేతల గడప...గడపా తిరుగుతున్నారు. జగన్ కు ప్రత్యామ్నాయ పదవులను అధిష్టానం కల్పిస్తుందా? లేదా జగన్ ను సీఎంగా అంగీకరిస్తుందా అన్నది తేలాల్సి ఉంది.
Pages: 1 -2- News Posted: 12 September, 2009
|