అమ్మో! హెలికాప్టర్! న్యూఢిల్లీ : ఇటీవల హెలికాప్టర్ పతనమై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డిని బలిగొన్న నేపథ్యంలో హెలికాప్టర్ ప్రయాణాలంటే రాజకీయ నాయకులు అమితంగా భయపడిపోతున్నారు. ఇలా కేంద్ర మంత్రులతో సహా అనేక మంది రాజకీయ నేతలు భయపడిపోయిన కారణంగానే షిల్లాంగ్ లో జరగవలసి ఉన్న మంత్రులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టుల మహాసభను రద్దు చేయవలసి వచ్చింది.
సాంఘిక రంగం అంశాలపై ఈ నెల 18, 19 తేదీలలో షిల్లాంగ్ లో ద్వైవార్షిక ఎడిటర్ల మహాసభకు ఆహ్వానం అందుకున్న మంత్రులు మేఘాలయకు వర్షాకాలంలో హెలికాప్టర్ లో ప్రయాణించే రిస్క్ తీసుకోవడానికి సుముఖంగా లేరని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాత ప్రాంతాలలో ఒకటి మేఘాలయ.
మహాసభకు సాధారణంగా సాంఘిక రంగ శాఖల మంత్రులు హాజరవుతుంటారు. ఈ నెల 18, 19 తేదీలలో జరపతలపెట్టిన మహాసభ కోసం మంత్రుల బృందం ఢిల్లీ నుంచి గౌహతికి విమానంలో వెళ్ళి, అక్కడి నుంచి బారాపానీకి హెలికాప్టర్ లో ప్రయాణించవలసి ఉందని అధికారులు తెలిపారు. షిల్లాంగ్ కు 32 కిలో మీటర్ల దూరంలోని బారాపాని విమానాశ్రయానికి కోలకతాతో మాత్రమే వైమానిక సంబంధాలు ఉన్నాయి.
'మంత్రులందరూ తమకు వీలైన తేదీల గురించి క్రితం నెలలోనే తెలియజేశారు. మేము తదనుగుణంగానే ఏర్పాట్లు చేశాం' అని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పారు. ఈ మంత్రిత్వశాఖ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖతో కలసి ఈ మహాసభను ఏర్పాటు చేసింది. 'అయితే, సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ దుర్మరణం తరువాత వారు విపరీతంగా భయపడిపోయారు. తప్పించుకోవడానికి వారు ఏదో ఒక సాకు చెప్పనారంభించారు' అని ఆ అధికారి తెలిపారు.
ఆనవాయితీ ప్రకారం, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సి.పి. జోషి ఈ మహాసభను ప్రారంభించవలసి ఉందని అధికార వర్గాలు తెలియజేశాయి. ఆయన అందుకు అంగీకరించారు కూడా. కాని ఆయన ఆ బాధ్యతను తన జూనియర్ ప్రదీప్ జైన్ కు అప్పగించారు. జైన్ ఆ బాధ్యతను మేఘాలయకు చెందిన తోటి సహాయ మంత్రి అగతా సంగ్మాకు అప్పగించారు. ఆమె ఈశాన్య ప్రాంత ప్రతినిధి అయినందున ఆమె సభను ప్రారంభించడమే శ్రేయస్కరమని జైన్ వాదించారు. కాని,. నాటింగ్ హామ్ విశ్వవిద్యాలయం నుంచి 'ఆలమీ లారియట్ అవార్డు' స్వీకరించడానికై తాను ఆ సమయంలో యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)లో ఉంటాను కనుక షిల్లాంగ్ సభను ప్రారంభించలేనని చెప్పారు. దీనితో నిర్వాహకులు సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికా సోనిని సంప్రదించారు. ఆమె ముందు అంగీకరించినా తరువాత వెనుకకు తగ్గారు.
Pages: 1 -2- News Posted: 12 September, 2009
|