షాక్ ఇచ్చిన సింఘ్వి న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక ప్రభుత్వం పని చేస్తోంది, పరిపాలన సజావుగా కొనసాగుతోంది, తీసుకోవలసిన నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారు కదా? అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథి అభిషేక్ సింఘ్వి వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో వైఎస్ విధేయ వర్గం ఖంగుతింది. అధిష్టానం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తే తమ తఢాకా చూపించాలనుకున్న వారికి ఆశాభంగమే మిగిలింది. ముఖ్యమంత్రి కె రోశయ్యను వెంటనే సిఎల్ పీ నేతగా ఎన్నుకోవలసిన అవసరం ఎంత మాత్రం లేదని అభిషేక్ సింఘ్వి తేల్చిచెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన సింఘ్వి ముఖ్యమంత్రి పదవికి, సీఎల్పీ నాయకుడిగా ఎంపిక కావడానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. అలా అని రోశయ్యను ఎల్లకాలం ముఖ్యమంత్రిగా కొనసాగమని చెప్పడం లేదు కదా? పార్టీ వీలును బట్టి కొత్త నాయకుడుని ఎంపికచేస్తుందని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదనేది గ్రహించాలని సింఘ్వి సూచించారు. పాత ప్రభుత్వంలోనే కొన్ని మార్పులు చేశాము, రాజశేఖరరెడ్డి అకాల మృతి వల్ల ఆయన స్థానంలో రోశయ్యను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పక్షంలోనే సీఎల్ పీ నాయకుడిని ఎన్నుకోవలసి ఉంటుందని ఆయన వాదించారు. రోశయ్యను సీఎల్ పీ నాయకుడిగా ఎన్నుకోవడం అనేది పార్టీ అంతర్గత వ్యవహారం, ఈ ప్రక్రియను పార్టీ వీలును బట్టి పూర్తి చేసుకుంటామని సింఘ్వి ప్రకటించారు. రోశయ్యను సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకోవడం అనేది పార్టీ అంతర్గత వ్యవహారం, ఈ ప్రక్రియను పార్టీ వీలును బట్టి పూర్తి చేసుకుంటామని సింఘ్వి ప్రకటించారు.
Pages: 1 -2- News Posted: 15 September, 2009
|