న్యూఢిల్లీ : సంక్షేమ పథకాలకు నిధులకు వెనుకబడిన తరగతుల జనాభా ఆధారంగా కేటాయించేందుకు తర్వలో అవకాశం లభించనుంది. ఇప్పటి వరకు గతంలో వేసిన అంచనాల ఆధారంగానే పథకాలకు నిధుల వితరణ జరుగుతోంది. 2011 లో జరిగే జనాభా గణనతో ఈ తీరుకు భరతవాక్యం పలకనున్నారు. ప్రతి పదేళ్ళకు జరిగే జనాభా లెక్కింపులో ఈసారి విశేషం ఏమిటంటే జనాభా లెక్కింపులో కులాలవారీగా సమాచార సేకరణ జరగనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన తరగతుల (ఓబీసీ) జనాభా 38.5 శాతం మాత్రమే నని ఇటీవల ఒక సర్వేలో తేలింది. ఈ సర్వే ఇచ్చిన స్ఫూర్తితో 2011లో జనాభా గణనలో కులాన్ని కూడా చేర్చాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కు న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల నిజమైన ఓబీసీకి తగ్గట్టుగా ప్రభుత్వం స్పందించడం లేదన్న ఓబీసీ నేతల వాదనకు అడ్డుకట్ట వేసినట్టు కాగలదు. బృహత్తరమైన ఈ ప్రక్రియ తొలిగా 1931లో కులాలతో జనాభా గణన జరిగింది.