మమత రంగుల రైలు! కోలకతా : భారతీయ రైల్వేల 150 ఏళ్ళ చరిత్రలో మొట్టమొదటిసారిగా చూడముచ్చటైన రంగురంగులతో ఒక రైలు ప్రయాణం ప్రారంభించింది. రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ ప్రారంభించిన సీల్డా-న్యూఢిల్లీ డ్యురోంటో ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రైమరీ కలర్లతో పెయింటింగ్ చేశారు. రైలుకు రంగురంగుల పూలదండలు వేశారు.
'మంత్రి స్వయంగా ఈ డిజైన్ ను ప్రతిపాదించారు. ఇటువంటి రంగులను రైల్వేలలో ఎన్నడూ చూడలేదు. ఈ కొత్త రైలుకు దీని వేగానికి తగినట్లుగా చూడముచ్చటైన రంగులలో రూపొందించాలని ఆమె కోరారు' అని రైల్వే శాఖ అధికారి ఒకరు తెలియజేశారు.
మమత తనకు తీరికగా ఉన్నప్పుడు పెయింటింగ్ లు వేస్తుంటారని, కవిత్వం రాస్తుంటారని అందరికీ తెలిసినదే. అవరోధాలు లేనిది అనే అర్థం వచ్చే 'డ్యురోంటో' రైలుకు కవితా దృష్టితో రూపకల్పన జరిగి ఉండవచ్చు. అయితే, సృజనాత్మకతకు ప్రతీకగా దీనికి శ్రీకారం చుట్టి ఉండకపోవచ్చు. త్వరలో ప్రవేశపెట్టనున్న మరి 13 డ్యురోంటో రైళ్ళు కూడా ఇదే డిజైన్ లో ఉంటాయని ఆ అధికారి తెలిపారు. మొదటి రైలుకు రంగులు వేసినందుకు అయిన ఖర్చు రెండున్నర లక్షల రూపాయలు. రైలు లోపల భాగాలను సాంప్రదాయక పెయింటింగ్ లతో అలంకరించారు. 'రైలు బోగీలలో వేగాన్ని సూచిస్తూ ప్రైమరీ కలర్లలో చిత్రాలు వేసి ఉంటాయి. వాటి మధ్యలో పరుగెడుతున్నట్లుగా జత కాళ్ళు నీలి రంగులో చిత్రించి ఉంటాయి' అని ఆయన వివరించారు.
మమతకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆకుపచ్చ రంగు అన్ని బోగీలపైన బేస్ కలర్ గా ఉంటుంది. (ఆమె పార్టీ గుర్తులో కూడా ఈ రంగు కనిపిస్తుంది). 'దీదీ పెయింటింగ్ లు అన్నిటిలో అద్వితీయ రీతిలో రంగుల సమాహారం ఉంటుంది. డ్యురోంటో విషయంలో కూడా అదే జరిగింది. ఆమెకు అత్యంత ప్రియమైన రంగు ఆకుపచ్చు. అది మాతృమూర్తికి, మట్టికి, మనిషికి ప్రతీక' అని మమత సన్నిహిత సహచరులు ఒకరు పేర్కొన్నారు. రమణీయమైన డ్యురోంటో రైలు గురించి సుమారు ఒకటిన్నర నెలల క్రితం ఆలోచన వచ్చింది. 'ఈ రైలు మధ్యలో ఎక్కడా ఆగకూడదని, రాజధాని కన్నా తక్కువ చార్జీ ఉండాలని, అత్యంత రమణీయంగాను ఉండాలని రైల్వే అధికారులకు ఆమె సూచించారు' అని ఆయన తెలియజేశారు.
రైలును జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా మమత మాట్లాడుతూ, 'రైల్వేలు సతత హరితాలు. డ్యురోంటో ఎక్స్ ప్రెస్ ఆలోచన కొత్తది. మా ఆలోచనలు ఆధునికమైనవి' అని చెప్పారు.
Pages: 1 -2- News Posted: 19 September, 2009
|