కాంగ్రెస్ టగ్ ఆఫ్ వార్!
సోమవారం ఉదయం వైఎస్ జగన్ హైదరాబాద్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుంచి ఢిల్లీకి రమ్మని పిలుపు వచ్చిందంటూ, జగన్ తో చర్చలు జరిపేందుకు అపాయింట్ మెంట్ ఇచ్చారంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఆ రోజు సాయంత్రం ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆ వార్తలను ఖండించారు. జగన్ ను సోనియా చర్చలకు పిలవనే లేదన్నారు. ఆ వార్తే నిజమైతే సోనియా కాని, తాను కాని, లేదా జగన్ కాని చెప్పి ఉండాలన్నారు. అలాంటిదేమీ లేనందున అది కేవలం పుకారు మాత్రమే అని కొట్టి పారేశారు.
కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి వీరప్ప మొయిలీ ఢిల్లీలోనే మీడియా ప్రతినిధులతో మంగళవారం మాట్లాడుతూ, జగన్ అపాయింట్ మెంట్ ను పార్టీ అధిష్టానం తిరస్కరించలేదని ప్రకటించడం గమనార్హం. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విషయంలో అధిష్టానం ఇంకా దృష్టిపెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.
మరో పక్కన జగన్ ను అధిష్టానం ఢిల్లీకి పిలిపించి నచ్చచెబుతుందని, అవసరం అనుకుంటే ఆయనకు కేంద్రంలో ఏ సహాయ మంత్రి పదవో ఆశచూపి ప్రస్తుతానికి ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉంచుతుందని కొందరు కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ బుధవారం ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు. వైఎస్ మరణానంతరం జగన్ ఢిల్లీ వెళ్ళడం ఇదే తొలిసారి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (ఆర్థిక) సమావేశంలో పాల్గొంటారని పైకి చెబుతున్నా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఏదో ఒక నిర్ణయాన్ని రాబట్టేందుకు యత్నించవచ్చు. అంతకు ముందు రాష్ట్రప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు, రాజశేఖరరెడ్డి ఆప్తమిత్రుడు, జగన్ శ్రేయోభిలాషి కె.వి.పి రామచంద్రరావు మంగళవారం సాయంత్రమే ఢిల్లీ వెళ్ళి పరిస్థితిని జగన్ కు సానుకూలం చేసే పనిలో పడ్డారు. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్ లో 'టగ్ ఆఫ్ వార్' క్రీడ సాగుతోంది. ఈ తాడుని అధిష్టానం ఎలా తెంపుతుందో? ఎవరు తెంపుతారో? ఎవరు వెల్లకిలా పడతారో వేచి చూడాల్సిందే!
Pages: -1- -2- 3 News Posted: 21 October, 2009
|