జగన్ అచ్చు అలానే... హైదరాబాద్ : గతంలో అంటే 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కడప లోక్ సభ్యునిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర స్థాయిలో అసమ్మతి రాజకీయాలు నడిపారు. ముఖ్యంత్రులకు కంటిమీద కునుకులేకుండా చేశారు. ఇప్పుడు జగన్ కూడా ముఖ్యమంత్రి పదవి ఆశించి విఫలమయ్యారు. దీంతో తండ్రి బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు ఉంది. విచిత్రంగా 1989లో ముఖ్యమంత్రి పదవి ఆశించిన రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఆశించిన జగన్ ఇద్దరూ లోక్ సభసభ్యులుగా ఉండడం, ఇద్దరూ కడప లోక్ సభ స్థానానికే ప్రాతినిధ్యం వహించడం విశేషం. బంజారాహిల్స్ లోని వైఎస్ ఉండే 'శ్రీబాగ్' నివాసం అసమ్మతి రాజకీయాలకు పుట్టిల్లుగా ఉండేది.
ఇప్పుడు జగన్ కూడా త్వరలోనే సాగర్ సొసైటీలోని తన సోదరి ఇంటికి మకాం మార్చనున్నారు. గతంలో వైఎస్ ఉన్న ఇంటికి వెనుక భాగంలో ఇప్పుడు జగన్ ఉండబోయే నివాసం ఉంటుంది. ముఖ్యమంత్రి పదవి తనకు ఇప్పట్లో లభించే అవకాశాలు లేవన్న నిర్ణయానికి వచ్చిన కడప ఎంపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనుసరించిన బాటలోనే నడవనున్నారు. మీడియా సమావేశంలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలను బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది. ఒక పక్క అధిష్ఠాన వర్గానికి పూర్తి విధేయతను ప్రకటిస్తూనే రాష్ట్రంలో వివిధ పథకాల అమలు తీరుపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి పైన, రాష్ట్ర ప్రభుత్వంపైన విమర్శనాస్త్రాలు సంధించాలన్నది జగన్ ద్విముఖ వ్యూహంగా కనిపిస్తోంది.
Pages: 1 -2- News Posted: 24 October, 2009
|