జగన్ అచ్చు అలానే... 1989 నుంచి 1994 వరకు మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రులు పని చేయగా వారి ముగ్గురి మంత్రివర్గాల్లోనూ కొందరు వైఎస్ కు వీర విధేయులు ఉండేవారు. ఇప్పుడు రోశయ్య మంత్రి వర్గంలో ఉండే వారందరూ దివంగత వైఎస్ పట్ల విధేయత ఉన్నవారే అయినా వీరిలో వీర విధేయులు కొందరే ఉన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారికన్నా వైఎస్ కే పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉండేది. ఇప్పుడు జగన్ కు కూడా అదే పరిస్థితి! అధిష్టానవర్గం దగ్గర మంచిగా ఉంటూ రాష్ట్రంలో అసమ్మతి రాజకీయాలను వైఎస్ నడిపించేవారు. ఇప్పుడు జగన్ కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పట్ల సంపూర్ణ విధేయతను ప్రకటిస్తూనే ముఖ్యమంత్రి రోశయ్య పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'స్వపక్షంలోనే విపక్ష పాత్ర పోషిస్తారా అన్న ప్రశ్నకు జనగ్ బదులిస్తూ... ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా ప్రజలకు ప్రయోజనం కలిగేలా చూడటం, ఈ దిశగా ప్రభుత్వం నడిచేలా చేయడం, ఏ పథకమైనా ప్రభుత్వం సరిగా అమలు చేయనప్పుడు వత్తిడి తేవడం పార్టీ కార్యకర్తలుగా మా విధి, పథకాలను ప్రభుత్వం సరిగా అమలు చేసినట్లయితే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. అప్పుడు వారి పార్టీకి విధేయులుగా ఉంటారు. దీనివల్ల పార్టీ బలపడుతుంది' అని వివరణ ఇచ్చారు.
జగన్ వ్యవహారశైలిని పరిశీలిస్తే కొంత దూకుడుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. వైఎస్ మరణం తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలుసుకుని వచ్చిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్ కొన్ని ముఖ్యమైన పథకాల అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇటువంటి అంశాలపై తన స్వరాన్నిమరింత పంచే అవకాశాలున్నాయి.
జగన్ నిర్ణయానికి పలువురు ఎమ్మెల్యేలు మద్దతు పలకడం గమనార్హం. పైగా సబ్సిడీ బియ్యం పథకంలో కోటాపెంపు, ఉచిత విద్యుత్ సరఫరా సమయాన్ని పెంచడం, తెల్ల రేషన్ కార్డుల సర్వే అంశాల్లో ప్రభుత్వ తీర్పుపై జగన్ అసంతృప్తిని వ్యక్తం చేసినప్పుడు ఆయన పక్కనే కనీసం పది మంది మంత్రులు ఉండటం విశేషం. విలేఖరుల సమావేశం ముగిసిన తర్వాత కొందరు మంత్రులు చప్పట్లు కొట్టడం గమనార్హం. నగరంలో లేనందున మరి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రాలేకపోయారని జగన్ చెప్పారు.
Pages: -1- 2 News Posted: 24 October, 2009
|