పరువు కోసం పిఆర్పీ పోరు
చిరంజీవి పార్టీ పెడతారంటూ వార్తలు వచ్చినప్పటి నుంచీ అన్నీ తానై ఏర్పాట్లు చేసిన డాక్టర్ మిత్రా కూడా పార్టీలో ఇమడలేక బయటికి వెళ్ళిపోయారు. అనతరం పార్టీ అధికార ప్రతినిధిగా వెలుగొందిన పరకాల ప్రభాకర్ అంతకు ముందే రాంరాం చెప్పేశారు. వ్యవహార దక్షుడిగా పేరు పొందిన రిటైర్డ్ డిఐజి ఆంజనేయరెడ్డి ఆయన కన్నా ముందే పిఆర్పీలో వ్యవహారాలు రుచించక తప్పుకున్నారు. ఎన్నికల ముందు ప్రచారానికి ఒక ఊపు, రూపు తెచ్చిన యువరాజ్యం అధ్యక్షుడు పార్టీకి దూరంగా లేరు గాని, షూటింగ్ ల పేరుతో బిజిబిజీగా గడుపుతున్నారు. పార్టీ ఏర్పాటుకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను కూడగట్టి, రహస్య, బహిరంగ సమావేశాలు నిర్వహించిన చిరంజీవి మరో సోదరుడు నాగబాబు కూడా పార్టీ కార్యక్రమాల్లో అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారు. ఒక వైపున నాయకులు ఎగిరెళ్ళిపోతుంటే వారికి నచ్చజెప్పే దారి తెలియక చిరంజీవి నిశ్చేష్టుడిగా ఉండిపోతుంటే మరో వైపున తమకు ఎన్నికల్లో న్యాయం జరగలేదని, టిక్కెట్లు సరిగా ఇవ్వలేదన్న అక్కసుతో అభిమానులు కూడా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాజకీయ కురువృద్ధుడిగా, ప్రణాళికలు రచించడంలో దిట్టగా పేరుపొందిన పి.శివశంకర్ ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. చిరంజీవి చిరకాల మిత్రుడు, కుటుంబ వైద్యుడు డాక్టర్ వినయ్ కూడా సఖ్యత కొరవడడంతో పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
అధికారం, నిధులు లేని నేపథ్యంలో పార్టీని ఐదేళ్ళూ నిలబెట్టడం, ఆపైన అధికారంలోకి తీసుకురావడం కత్తిమీద సామే అని తేలిపోవడంతో పార్టీలో కొంతవరకూ స్తబ్ధత ఏర్పడింది. అడపా దడపా కొన్ని కార్యక్రమాలు, పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ స్పందన ఇంతకు ముందు వచ్చినంత స్థాయిలో మాత్రం కనిపించడం లేదు. పార్టీ క్యాడర్ కూడా క్రమంగా దూరమవుతున్న క్రమంలో ఇటీవలి వరద ప్రాంతాల్లో ప్రజారాజ్యం పార్టీ స్పందన అంతంత మాత్రంగానే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వరద బాధితుల సహాయార్థం చిరంజీవి ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన 'జోలె యాత్ర'కు ప్రజల నుంచి సాధారణ స్పందనే లభించింది.
Pages: -1- 2 -3- News Posted: 29 October, 2009
|