పరువు కోసం పిఆర్పీ పోరు
పోయినోళ్ళు పోగా ఉన్నవారితోనైనా పార్టీని పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో చిరంజీవి ఇటీవల కొన్ని సంస్థాగత మార్పులు చేశారు. వాటిలో ప్రధానమైనవి కనిపించిన ప్రతి ఒక్కరి మీద వేగంగా నోరు పారేసుకునే మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణిని ఆ పదవి నుంచి తప్పించి ప్రజారాజ్యం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. అలాగే షూటింగ్ లతో బిజీగా ఉండడమే కాకుండా అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండని యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బాధ్యతల్లో కొన్నింటిని డాక్టర్ శ్రావణ్ కు పంచి ఇస్తూ ఆయనను యువరాజ్యం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. అసలు ప్రజారాజ్యం ఇంతగా భ్రష్టు పట్టిపోవడానికి మూల కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న చిరంజీవి బావ అల్లు అరవింద్ ను ఈ మార్పుల్లో పూర్తిగా పక్కన పెట్టడం గమనార్హం.
ప్రజారాజ్యం పార్టీ క్రమశిక్షణా సంఘానికి అధ్యక్షునిగా రాజకీయ కురువృద్ధుడు, తొలి నుంచీ చిరంజీవి శ్రేయోభిలాషిగా మసలుతున్న చేగొండి హరిరామ జోగయ్యకు అప్పగించారు. తొమ్మిది జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను కూడా రెండు రోజుల క్రితమే చిరంజీవి నియమిస్తూ ప్రకటన చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ నిర్వహణ, నియంత్రణ బాధ్యత మొత్తం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి భుజస్కంధాల పైనే మోస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అడపా దడపా శ్రావణ్, హరిరామ జోగయ్య, మరి కొందరు విఆర్ నారగోని, కత్తి పద్మారావు లాంటి కొద్ది మంది నాయకులు మాత్రమే ప్రజరాజ్యం పార్టీ గొంతును వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు పార్టీని నిలబెట్టుకోవడం ఇటు పోయిన పరువును దక్కించుకోవడం అనే లక్ష్యాలతో చిరంజీవి ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో అయినా గౌరవనీయమైన సంఖ్యలో అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజారాజ్యం పార్టీ అధినాయకత్వం వ్యూహాలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
Pages: -1- -2- 3 News Posted: 29 October, 2009
|