'ఢిల్లీయేతరుడే బిజేపీ చీఫ్' పార్టీ సారథ్యాన్ని ఒక యువ నాయకునికి అప్పగించేందుకు విధివిధానాలపై బిజెపి నాయ.కులతో భాగవత్, ఇతర సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకులు వరుసగా సమావేశాలు నిర్వహించినప్పటి నుంచి పార్టీని ఆవహించిన సస్పెన్స్ కు ఆయన వ్యాఖ్యలు తెర దించాయి. ఆ నాయకుడు 55, 60 వయో వర్గంలో ఉండాలని సంఘ్ చీఫ్ సూచించారు. ఆ ప్రక్రియ ఇప్పుడు వేగంగా సాగుతున్నది.
నాగపూర్ కు చెందిన 52 సంవత్సరాల గడ్కారి ప్రస్తుతం బిజెపి మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఆయన ఆర్ఎస్ఎస్ కు సన్నిహితుడని భావిస్తున్నారు. క్రితం నెల రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన - బిజెపి కూటమి పరాజయం పొందినప్పటికీ ఆయన అవకాశాలకు అది హాని కలిగించకపోవచ్చు. ఆయన బ్రాహ్మణుడు కావడం కూడా అవరోధంగా భావించడం లేదు. అదే కులానికి చెందిన ఇద్దరు నేతలు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ లను ఇటీవల వరుసగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకునిగాను, లోక్ సభలో ఉప ప్రతిపక్ష నాయకురాలిగాను నియమించినప్పటికీ గడ్కారి పార్టీ బాధ్యతలు చేపట్టడానికి అభ్యంతరాలు ఉండకపోవచ్చు.
ఆయన స్వస్థలం నాగపూర్ కావడం ఆర్ఎస్ఎస్ తో సాన్నిహిత్యానికి దోహదం చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. జాతీయ రాజకీయాలలో ఇంతవరకు పాల్గొనకపోయినప్పటికీ ఆయనకు పలుకుబడి రావడానికి అదే కారణమై ఉండవచ్చు. ఇతర అభ్యర్థులలో గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పర్రికర్ కూడా ఉన్నారు. ఆయనా బ్రాహ్మణుడే. కాని ప్రతిపక్ష నాయకుడు ఎల్.కె. అద్వానీని 'పులిసిపోయిన ఊరగాయ'గా అవివేకంగా వ్యాఖ్యానించడం ద్వారా పర్రికర్ తన అవకాశాలను చెడగొట్టుకున్నారని పలువురు భావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ పాతకాపు, బిజెపి ఉపాధ్యక్షుడు బాల్ ఆప్టెను పార్టీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా కొందరు భావిస్తున్నారు. కాని ఎక్కువ వయస్సు కారణంగా ఆయనకు అవకాశం దక్కకపోవచ్చు.
ఇప్పటికే జాతీయ రాజకీయాలలో అనుభవం సంపాదించిన ఒక నాయకుడు పార్టీ బాధ్యతలు చేపట్టగలరనే భావన నెలకొన్న దృష్ట్యా బిజెపి పార్లమెంట్ సభ్యులలోనే ఒకరికి ఈ అవకాశం లభించగలదన్న పార్టీ నాయకుల ఆశలకు ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న ఈ వైఖరితో గండి పడనున్నది. రాహుల్ గాంధి అంతకంతకూ తన ప్రభావం చూపుతుండడంతో ఒక ఆధునిక, మధ్యేవాది నాయకుని తెరపైకి తీసుకురావలసిన అవసరం కనిపిస్తున్నది.
Pages: -1- 2 -3- News Posted: 7 November, 2009
|