రాహుల్ బాటలో గడ్కరి! న్యూఢిల్లీ : కమ్యూనిస్టులు ప్రకాశ్ కరత్, హరికిషన్ సింగ్ సుర్జీత్ నుంచి పాఠాలు నేర్చుకోవలసిందిగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) కొత్త అధ్యక్షుడు నితిన్ గడ్కరిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సిద్ధాంతకర్త ఎం.జి. వైద్య కోరారు. కాని సిపిఎం నేతలకు బదులుగా కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధి పంథాను బిజెపి కొత్త అధ్యక్షుడు అనుసరిస్తున్నట్లున్నారు.
దళితులతో కలసి భోజనం చేయడం గురించి లేదా వారి ఇళ్లలో నిద్రించడం గురించి గడ్కరి ఇంకా ఆలోచించడం లేదు. కాని పూలమాలలు వేయించుకోవడం, సాష్టాంగ నమస్కారాలు చేయించుకోవడం వంటి కాంగ్రెస్ జమీందారీ సంప్రదాయాలను తోసిరాజన్న రాహుల్ వలె బిజెపి అధ్యక్షుడు కూడా తన పార్టీలో నేతల పాదాలకు నమస్కరించే సంస్కృతికి స్వస్తి చెప్పించాలని అభిలషిస్తున్నారు.'విభిన్నమైన పార్టీ అనే మా నినాదాన్ని అక్షరాల రుజువు చేస్తాం. విలక్షణతను నిలబెడతాం. కటౌట్లకు స్వస్తి' అని గడ్కరి గురువారం న్యూఢిల్లీలో తన తొలి విలేఖరుల గోష్ఠిలో చెప్పారు. 'నేను మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా, మంత్రిగా ఉన్నప్పుడు నాకు విమానాశ్రయంలో ఎవ్వరూ వీడ్కోలు చెప్పలేదు. స్వాగతమూ పలకలేదు. ఢిల్లీలో నేను కుర్తా పైజమా ధరించాలని నాకు సూచించారు. అయితే, నేను ధరిస్తుండే దుస్తులు (ఉన్ని కోటు, పోలో నెక్ స్వెట్టర్, ఉన్ని ప్యాంటు) నాకు సౌఖ్యంగా ఉంటాయి. నా పాదాలను తాకి నమస్కరించాలని గాని, నాకు పూలమాలలు వేయాలని గాని నేను కోరుకోవడం లేదు' అని గడ్కరి తెలియజేశారు.
పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు చెప్పాలని అభిలషించే వారికి వాటికి సమాన మొత్తాన్ని విదర్భలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల సహాయార్థం బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసే హుండీలో నగదుగా వేయవలసిందిగా సలహా ఇచ్చారు.
Pages: 1 -2- News Posted: 25 December, 2009
|