చిన్నారులకు 'మావో' భూతం లాల్ గఢ్ (పశ్చిమ బెంగాల్) : అన్నెం పున్నెం ఎరుగని అమాయక బాలలు... నిద్దట్లో ఉలికి ఉలికి పడుతున్నారు. పక్కలు తడిపేస్తున్నారు. ఆ చిన్నారులు నిత్యం భయంతో వణికిపోతున్నారు. దీనంతటికీ మవోయిస్టుల హింసాత్మక ఘటనలే కారణం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో నిరాఘాటంగా సాగుతున్న హింసాత్మక సంఘటనలు చిన్నారులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఒక ఏడాదిగా హత్యలను, రక్తపాతాన్ని చూస్తున్న లాల్ గఢ్, పరిసర ప్రాంతాల పిల్లలలో అధిక సంఖ్యాకులు ఇప్పుడు భయంతో వణకిపోతున్నారు. వారు మానసికంగా ఒక రకం వ్యథకు లోనవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. వారు నిద్ర మధ్యలో భయంతో కేకలు పెడుతున్నారు, స్కూలుకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు. స్నేహితులను కూడా రావద్దంటున్నారు.
గత సెప్టెంబర్ లో సల్బోనీలోని రాంజా గ్రామంలో పది సంవత్సరాల రాఖీ (పేరు మార్చడమైనది) తన తండ్రిని ఇంటిలో నుంచి లాక్కుంటూపోయి కాల్చి చంపడాన్ని చూసి బెదరిపోయింది. కొన్ని రోజుల పాటు ఆమె మౌనంగా ఆ బాధను భరించింది. ఆతరువాతే ఆమెకు పీడకలలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి 'రోజూ రాత్రి రాఖీ దెయ్యం పట్టినట్లుగా వణకిపోతున్నది' అని ఆమె తల్లి తమ పూరిల్లు వరండాలో కూర్చుని తన కుమార్తె సంగతి పూసగుచ్చినట్లుగా చెప్పింది. 'దాదాపు ప్రతి రాత్రి అదే వరుస. ఆమె మంచి నిద్ర పోతున్నట్లు కనిపిస్తుంది. కాని ఉన్నట్లుండి లేచి తన తండ్రిని లాక్కుని వెళుతున్నారంటూ భయంతో కేకలు వేస్తుంటుంది' అని తల్లి వివరించింది. 'నిద్రలోనే ఆమె 'నాన్నగారిని తీసుకువెళ్ళకుండా వారిని ఆపండి, వారు ఆయనను చంపుతారు' అని అరుస్తుంటుంది. ఆతరువాత ఆమె వెక్కివెక్కి ఏడుస్తూ, పక్క తడుపుకుంటుంది' అని తల్లి తెలియజేసింది.
Pages: 1 -2- News Posted: 26 December, 2009
|