'వైఎస్ లా పాలించలేను' కొత్త గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ రాష్ట్రంలో పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని వస్తున్న విమర్శలను సిఎం తోసిపుచ్చారు. 'అది అంతా అబద్ధం' అని ఆయన అన్నారు. 'గవర్నర్ నియామకం గురించి నాకు తెలియజేశారు. ఫర్వాలేదని అన్నాను. నాకు తెలిసినంతవరకు పోటీ ప్రభుత్వం అనేదే లేదు' అని రోశయ్య చెప్పారు.
తాను ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్నడూ తహతహలాడలేదని ఆయన తన విమర్శకులకు గుర్తు చేశారు. 'నేను ఎన్నికైన ముఖ్యమంత్రిని కాను, నేను ఎంపికైన ముఖ్యమంత్రిని' అని ఆయన వ్యాఖ్యానించారు. 'నేను పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. అయితే, ప్రధాన సమస్యలపై నేను పార్టీ అధిష్ఠాన వర్గాన్ని సంప్రదించవలసి ఉంటుంది.. నేను కాంగ్రెస్ సైనికుడిని కనుక అధిష్ఠానానికి ఎప్పుడూ విధేయుడినే. రాష్ట్రాన్ని పాలించేందుకు నేను రాజానని ఎన్నడూ భావించను. మీకు తోచిన విధంగా మీరు ఏమైనా అనుకోండి. ఇది నా బలహీనత అని మీరనవచ్చు. కాని నేను ఈ పంథాను వీడను' అని రోశయ్య స్పష్టం చేశారు.
పదవిలో నిలదొక్కుకుని ప్రభుత్వ పథకాల అమలుపై దృష్టి కేంద్రీకరించేందుకు తనకు తగినంత వ్యవధి లేకపోయిందని రోశయ్య అంగీకరించారు. 'దురదృష్టకర పరిస్థితిలో (వైఎస్ఆర్ మృతి కారణంగా) నన్ను సిఎంను చేసినప్పుడు ఒక నెల పాటు రాజకీయ అనిశ్చితి కొనసాగింది. కొందరు ఎంఎల్ఎలు జగన్ ను సిఎం చేయాలంటూ ప్రచారం ప్రారంభించారు' అని ఆయన తెలిపారు. 'ఆ తరువాత కని వినీ ఎరగని అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. అటుపిమ్మట ఇదివరకెన్నడూ లేని రీతిలో వరద బీభత్సం సంభవించింది. నేను నిలదొక్కుకునే లోగానే చంద్రశేఖరరావు తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు' అని ఆయన వివరించారు.
మీరు ఎందుకు కొరడా ఝళిపించలేదనే ప్రశ్నకు సిఎం సమాధానం ఇస్తూ, 'నేను నిష్కర్షగా, దూకుడుగా వ్యవహరించాలని ఎవరైనా ఎలా అనుకుంటారు? దూకుడుగా వ్యవహరించేందుకు నా వయస్సు నన్ను అనుమతించదు. కాని నిష్కర్షగా వ్యవహరించగలను' అని అన్నారు.
Pages: -1- 2 -3- News Posted: 1 January, 2010
|