అమానుష హత్యల క్రీడ తొలుత వైష్ణవి కిడ్నాప్ నకు గురైందన్న వార్త వెలువడగానే ఈ దారుణానికి పాల్పడినది ఎవరై ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగించారు. తొలుత రౌడీ షీటర్ల పనేని అనుమానించి భంగపడ్డ పోలీసులు ప్రభాకర్ ను విచారించి ఆయనకున్న శత్రువులు, అనుమానంపై ఆరా తీసారు. అపుడే బయల్పడిందీ వెంకట్రావ్ బండారం. బెజవాడ కమీషనర్ రాజేంధ్రనాథ్ రెడ్డి తనదైన శైలిలో విచారించగా తాను చేసిన దారుణాన్ని వెంకట్రావ్ బయటపెట్టాడు. ప్రభాకర్ ను దెబ్బ తీసేందుకు తాను రచించిన పథకాన్ని వివరించాడు. అయితే ప్రస్తుతం వెంకట్రావ్, వరసకు సోదరుడైన శ్రీనివాలరావులు పోలీసుల అదుపులోనే ఉండటంతో, వారికి సహకరించిన వారి కోసం పోలీసుల అన్వేషణ సాగిస్తున్నారు.
అయితే ఈ కేసులో పోలీసులు వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత కిడ్నాప్ జరిగినపుడే సమర్థవంతంగా వ్యవహరించి ఉంటే వైష్ణవి దక్కేదనే వాదనలు వినవస్తున్నాయి. వైష్ణవిని ఎత్తుకెళ్లిన తరువాత డబ్బు కోసం ఎటువంటి డిమాండ్ లు రాకపోవడంతో పాతకక్షలే కారణమని పోలీసులు సకాలంలో గ్రహించలేకపోయారు. అలాగే ఘటన స్థలం వద్ద లభించిన బైకుల ఆధారంగా దర్యాప్తుపై పోలీసులు దృష్టిసారించలేకపోయారు. కిడ్నాప్ జరిగిన తరువాత ప్రభాకర్ కుటుంబసభ్యలను గానీ, అవతల కుటుంబ సభ్యులను గానీ ప్రశ్నించలేదు. శనివారం ఉదయం ప్రభాకర్ మొదటి భార్య ఇంటికి తాళం వేసి ఆమె కనిపించకుండా పోయారు. దీనిపై ఆరా తీసినా పోలీసులకు కొంతమేర సమాచారం లభించి ఉండేది. అలాగే నిందితులు గుంటూరు వైపు వెళ్లారన్న సమాచారం వచ్చినా, రెండు జిల్లాల పోలీసులు కలసి సమన్వయంతో దర్యాప్తు సాగించలేకపోవడం ఘోర వైఫల్యం. ప్రభాకర్ ని విచారించిన తరువాత కుటుంబ గొడవలు, వ్యాపార లావాదేవీలు బయటకి వచ్చాయి. శనివారం ఉదయం ఘటన జరిగినా, ఆదివారం సాయంత్రానికి గాని కుటంబ కలహాలతోనే కిడ్నాప్ చేసారా అన్న కోణంలో పోలీసులు విచారణ సాగించలేకపోయారు. సోమవారం సాయంత్రం వరకు వైష్ణవి హత్య ఉదంతాన్ని పసిగట్టలేకపోయారు. పోలీసులు మరికాస్త ఆలస్యం చేస్తే గుంటూరులోని శారద ఇండస్ట్రీస్ లో వైష్ణవి ఎముకలు కూడా లభించేవి కాదు. ఈ కేసు విషయంలో మొదటి నుండి కీలక ఆధారాలు దొరుకుతున్నప్పటికీ పోలీసుల వాటిని పసిగట్టి విచారణ వేగవంతం చేయలేకపోవడం దారుణానికి ఒక కారణమనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది.
Pages: -1- -2- 3 News Posted: 2 February, 2010
|