'ద్వంద్వ' ఆరాటం బర్త్ సర్టిఫికెట్ల కోసం న్యూఢిల్లీ నుంచి తాజాగా ఆదేశాలు రావడంతో భారత దౌత్య కార్యాలయాలలో వీసా జారీ ప్రక్రియ దాదాపుగా స్తంభించిపోయింది. దీనికి మరొక సమస్య కూడా తోడైంది. వీసా సేకరణ, బట్వాడా ప్రక్రియను భారతీయ రాయబార కార్యాలయం ఔట్ సోర్స్ చేసిన సంస్థ న్యూయార్క్ కార్యాలయంలో టెలిఫోన్ వ్యవస్థ క్రితం వారం కుప్పకూలింది. ట్రావిస్టా ఔట్ సోర్సింగ్ సంస్థ వెబ్ సైట్ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేసింది.
భయానికి గురైన భారతీయ వీసాల దరఖాస్తుదారులకు, ముఖ్యంగా అత్యవసర పనులపై ఇండియాకు వెళ్ళవలసి ఉన్నవారు ఫిర్యాదుల దాఖలుకు లేదా సమస్యల పరిష్కారానికి ఎవరిని కలుసుకోవాలో తెలియని అగమ్యగోచర స్థితిలో పడిపోయారు. యుఎస్ లో జన్మించిన అమెరికన్లు తమ బర్త్ సర్టిఫికెట్లను సమర్పించిన తరువాతే వారికి భారతీయ వీసాలను యుఎస్ లోని భారత కాన్సులర్ అధికారులు జారీ చేయాలని న్యూఢిల్లీ నుంచి తాజాగా అందిన ఉత్తర్వు స్పష్టంగా కోరుతున్నది. యుఎస్ లో జన్మించిన అమెరికన్ల వద్ద సాధారణంగా బర్త్ సర్టిఫికెట్లు ఉంటాయి. కాని వారిలో భారతీయ వీసాల కోసం దరఖాస్తు చేస్తున్న చాలా మంది ఆ సర్టిఫికెట్ ను వెతికి పట్టలేకపోతున్నారు. ఎందుకంటే దైనందిన జీవితంలో దాని అవసరం రావడం అరుదు.
తమ బర్త్ సర్టిఫికెట్లకు బదులు తమ మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్లు లేదా పాత భారతీయ పాస్ పోర్టులను సమర్పించే భారతీయ అమెరికన్లకు వీసాలు జారీ చేసేందుకు కాన్సులర్ అధికారులను కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కాని, అటువంటి దరఖాస్తుదారులు హడావుడిలో అవి ఎక్కడ ఉన్నాయో వెతికి పట్టలేకపోతున్నారు. వాస్తవానికి వారిలో కొందరు ఇండియాలోనే లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రదేశాలలో వాటిని ఉంచారు. వారు ఇప్పుడు అత్యవసర పరిస్థితిలో లేదా ఇతర అవసరాలకు ఇండియాకు రాలేకపోతున్నారు.
పుట్టిన బిడ్డలకు బర్త్ సర్టిఫికెట్లను జారీ చేయడాన్ని ఇండియా 1967 నుంచి ప్ర్రారంభించిందని వాషింగ్టన్ లో ఈ వ్యవహారం చూస్తున్న అధికారులు తెలియజేశారు. 1967కు ముందు ఇండియాలో జన్మించిన, 1950, 1960 దశకాలలో అమెరికాకు వలస వచ్చిన వారిలో చాలా మంది వద్ద బర్త్ సర్టిఫికెట్లు లేకపోవడమో లేదా పోగొట్టుకోవడమో లేదా తమ భారతీయ పాస్ పోర్టులను ఎక్కడో పెట్టి మరచిపోవడమో జరిగింది.
Pages: -1- 2 -3- News Posted: 12 February, 2010
|