వేగంగా దర్యాప్తు: ప్రధాని న్యూఢిల్లీ : పుణెలో బాంబు విస్ఫోటం నేపథ్యంలో ఆంతరంగిక భద్రత పరిస్థితిపై సమగ్రంగా సమీక్షించిన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉగ్రవాదుల దాడిపై శీఘ్రంగా దర్యాప్తు నిర్వహించేందుకు సమన్వయంతో, సమర్థమైన చర్య తీసుకోవలసిందిగా కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదివారం ఆదేశించారు.ఈ పరిస్థితిపై హోమ్ మంత్రి పి. చిదంబరంతో చర్చించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ దర్యాప్తును వేగిరపరచాలని ఆదేశించాని, దీని వల్ల 'ఈ కిరాతకానికి బాధ్యులైన దుండగులను సాధ్యమైనంత త్వరంగా గుర్తించి , న్యాయస్థానంలో నిలబెట్టవచ్చు' అని ప్రధాని సూచించారని ప్రధాని కార్యాలయం (పిఎంఒ) అధికార ప్రతినిధి ఒకరు తెలియజేశారు. శనివారం పేలుడు అనంతరం పుణెలో నిర్వహిస్తున్న దర్యాప్తు గురించి ప్రధానికి హోమ్ మంత్రి వివరించారు.
ఈ పేలుడు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు, క్షతగాత్రులకు, వారి కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల సమీప బంధువులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు లక్ష రూపాయలు వంతున ఎక్స్ గ్రేషియాను ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి ఆయన ప్రకటించారు. ఈ దుర్ఘటనలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు కావలసిన సహాయాన్ని ప్రభుత్వం అందజేయగలదని ప్రధాని హామీ ఇచ్చారు.
అంతకుముందు చిదంబరం హోమ్ మంత్రిత్వశాఖలో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. పుణె బాంబు పేలుడు దృష్ట్యా దేశవ్యాప్తంగా భద్రత పరిస్థితిని ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా 32 మంది గాయపడిన విషయం విదితమే.
Pages: 1 -2- News Posted: 15 February, 2010
|