రాహుల్ ఫోబియా అయితే, దిగ్విజయ్ ఉత్థానానికి రాహుల్ తో సాన్నిహిత్యానికి మించిన ప్రాముఖ్యమే ఉన్నది. మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కావడంతో పాటు, చురుకుగా పని చేస్తున్న నాయకుడుగా కూడా ఆయనను భావిస్తున్నారు. అంతేకాకుండా ఏవిధంగానైనా పనులు చక్కబెట్టుకోగల ప్రావీణ్యం ఉన్నది. అమర్ సింగ్ వంటి వారిని నేరుగా ఢీకొనగల ధైర్యాన్ని కూడా ఆయన ప్రదర్శించారు. భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత పదవుల కోసం పోటీలో ఇతర ప్రధాన కార్యదర్శులను దిగ్విజయ్ వెనుకకు నెట్టారని పార్టీ ఆంతరంగికులు చెబుతున్నారు.
'రాహుల్ బృందం'లో సభ్యులుగా మారిపోయిన జితేంద్ర సింగ్, జితిన్ ప్రసాద, ఆర్.పి.ఎన్. సింగ్, దీపేందర్ హూడా, సచిన్ పైలట్, రవ్ నీత్ సింగ్, మీనాక్షీ నటరాజన్, అశోక్ తన్వర్ వంటి యువ నాయకులతో పాటు జైరామ్ రమేష్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ వంటి పెద్దలు కూడా ఆయన యంత్రాంగంలో చోటు సంపాదించుకున్నారు. సోనియాకు అత్యంత నమ్మకస్థుడైన విధేయుడు అహ్మద్ పటేల్ కూడా ఆ భావి యంత్రాంగంలో సభ్యుడే. ఇక రాహుల్ సలహా కోసం సంప్రదించే పెద్దలలో ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఎ.కె. ఆంటోనీ కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
'భావి ప్రధాని'తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకోవడంలో విఫలురైన కొందరు నాయకులు ఆంతరంగిక సంభాషణలలో రాహుల్ 'ప్రత్యేక రాజకీయాల' గురించి నిరసన ప్రకటిస్తుంటారు. 'ఆయన నడుపుతున్నది రాహుల్ బ్రిగేడ్ నే, కాంగ్రెస్ ను కాదు' అని ఒక నాయకుడు అన్నారు. అయితే, అటువంటి వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇటువంటి నాయకులు పార్టీ వృద్ధికి కృషి చేసింది కద్దు. 2004లో కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చిన ఎన్నికలను కూడా పార్టీకి సెమీఫైనల్ గా వారు పేర్కొన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 22 February, 2010
|